లబ్బీపేట(విజయవాడతూర్పు): గిరిపురంలో డయేరియా సోకిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరం సోమవారం కూడా కొనసాగనుంది. ప్రస్తుతం ఆదివారం కొత్తగా కేసులు ఏమీ నమోదు కానప్పటికీ సోమవారం కూడా వైద్య బృందాలు ఇంటింటి సర్వే చేయనున్నాయి. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలు ఇచ్చే వరకూ వైద్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఏ శ్రావణ్‌బాబు తెలిపారు. కాగా ఈ వైద్య శిబిరంలో ఆదివారం 18మంది చికిత్స చేశారు. వారంతా జనరల్ ఓపీకి వచ్చిన వారేనని వైద్యులు తెలిపారు. వారిలో డయేరియా బాధితులు లేరని చెప్పారు. గిరిపురంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ఏ సమయంలోనైనా అనారోగ్యానికి గురైన వారు రావచ్చని తెలిపారు.
ప్రజలకు ఆరోగ్య అవగాహన..
గిరిపురంలో ఇంటింటి సర్వే చేపడుతున్న సిబ్బంది, పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛమైన నీరు తాగడం, వేడి వేడి ఆహారం తీసుకోవడం వంటి అంశాలను స్థానికులకు వివరిస్తున్నారు. ఆర్వో వాటర్‌ను కూడా కాచి చల్లార్చిన తర్వాత తాగితే మంచిదని సూచిస్తున్నారు. అంతేకాకుండా పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆస్పత్రికి తరలించేందుకు 108 వెహికల్‌ను అక్కడ అందుబాటులో ఉంచారు.
పైప్‌లైన్‌లకు మరమ్మతులు..
మంచినీరు సరఫరా అయ్యే పైపుల్లో డ్రెయినేజీ వాటర్ కలుస్తోందనే అనుమానాలు రావడంతో ఆదివారం మంచినీటి పైప్‌లైన్‌లను డమ్మీ చేసి, పలు ప్రాంతాల్లో వీఎంసీ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. అదే విధంగా ఇళ్లలో నుంచి మురుగు నీరు సైడు డ్రెయిన్‌లలోకి రాకుండా చూడాలని ప్రజలకు సూచించారు. పూడిన డ్రైయిన్‌లను శుభ్రం చేశారు.


