గాంధీనగర్(విజయవాడసెంట్రల్): టిఫిన్ సెంటర్ ధ్వంసం చేసిన ఘటనపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం భవానీపురానికి చెందిన పలగాని శివరామ్ ప్రసాద్ విద్యాధరపురం చెరువు సెంటర్‌లో నాగండ్ల సీతామహాలక్ష్మికి చెందిన ఖాళీ స్థలం అద్దెకు తీసుకుని టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. గతేడాది డిసెంబర్‌లో స్థల యజమాని కొడుకులు పవన్, తేజ వచ్చి ఖాళీ చేయాలని అడిగారు. దానికి శివరామ్ ప్రసాద్ అంగీకరించలేదు. తాను రూ. 5లక్షలు ఖర్చు చేసి స్థలం మెరక చేశానని చెప్పాడు. యజమాని కుమారులు పదే పదే ఖాళీ చేయాలని గొడవ చేస్తుండడంతో అతను కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో శివరామ్ ప్రసాద్ హోటల్ మూసివేసి ఇంటికి వెళ్లాడు, మర్నాడు ఉదయం 6 గంటలకు హోటల్ వద్దకు వెళ్లగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి, అందులోని టేబుల్స్, కుర్చీలు, సీసీ కెమెరాలు, క్యాష్ కౌంటర్‌లోని రూ. 42 వేల నగదు తీసుకెళ్లిపోయారు. షాపులో సామాన్లు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భవానీపురం పోలీసు స్టేషన్‌లో బాధితుడు శివరామ్ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. స్థల యజమాని కొడుకులు హోటల్ ధ్వంసం చేసి ఉంటారని పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు
గుంటూరు ఎడ్యుకేషన్: దసరా సెలవుల్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించనున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) లో పలు కీలక మార్పులు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సాంబశివపేటలోని ఏసీ కళాశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన టెట్ తెలుగు అవగాహన తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డీఎస్సీకి అనుసంధానంగా నిర్వహించే టెట్‌కు, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్‌లో మార్పులు లేనట్లయితే అది స్పెషల్ టెట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. స్పెషల్ టెట్‌లో కామన్‌గా అందరికీ పాస్ మార్కు తగ్గింపుగా ఉండాలని, ఆఫ్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2ఏ పరీక్షలో ఉపాధ్యాయుడు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు వరకే సిలబస్ ఉండాలని, తనవి కాని సబ్జెక్టును తొలగించాలన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నిర్వహించిన సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు అవగాహన తరగతులు విజయవంతమయ్యాయని, మహిళా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. టెట్ అవగాహన తరగతులను నిర్వహించేందుకు సహకారం అందించిన ఏసీ కళాశాల యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. తరగతుల ముగింపు కార్యక్రమంలో తెలుగు రీసోర్స్ పర్సన్ ఆర్.వెంకటరావును సత్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమకుమారి, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ టీఎస్‌ఎల్‌ఎన్ మల్లేశ్వరరావు, రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, జిల్లా కోశాధికారి ఎండీ దౌలా, యూత్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


