● కాల్‌మనీ బాధితుడు మోతె గోపరాజు ఆవేదన ● పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): కాల్‌మనీ వడ్డీ వ్యాపారులతో తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని బాధితుడు మోతె గోపరాజు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీ వ్యాపారులు తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని కోరారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తాను ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో సీనియర్ సేల్స్ మేనేజర్‌గా పని చేశానని తెలిపారు. వ్యాపార అవసరాల కోసం 2024 జూలై నుంచి 2025 సెప్టెంబర్ మధ్య కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన సుంకర ఫాల్గుణ సాయి నరేన్ (సుంకర సాయి) వద్ద రూ.96 లక్షలు అప్పుగా తీసుకున్నానని తెలిపారు. ఆ అప్పునకు సంబంధించి అసలు, వడ్డీ కలిపి విడతల వారీగా రూ.1.90 కోట్లు చెల్లించినా, ఇంకా వడ్డీ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న సుంకర సాయి తన అనుచరులతో కలిసి ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి తన భార్యకు చెందిన ఖాళీ చెక్‌బుక్‌తో పాటు నాలుగు ఖాళీ ప్రాంశరీ నోట్లపై సంతకాలు చేయించుకుని తీసుకెళ్లారని ఆరోపించారు. ఆ తర్వాత తనపై పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, స్టేషన్‌కు వెళ్లినప్పుడు పోలీసులు తన వివరణను పట్టించుకోకుండా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారని తెలిపారు. పలుమార్లు ఇంటికి వచ్చి బెదిరించడంతో పాటు, ఇంటిని ఖాళీ చేయించాలని యజమానిని కూడా బెదిరించారని వాపోయారు. జూన్ 5న పోలీస్‌స్టేషన్‌కు పిలిచి, డబ్బులు చెల్లిస్తానని తనతో వీడియో రికార్డు చేయించారని, లేకుంటే తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని బెదిరించారని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ పటమట, విస్సన్నపేట పోలీసులు కూడా వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. తాను డబ్బులు తిరిగి చెల్లించినట్లు ఆధారాలు చూపినా పోలీసులు పట్టించుకోకుండా వారికే వత్తాసు పలుకుతున్నారని, తనకు సుంకర సాయి, నిమ్మగడ్డ తిరుపతిరావు, వెల్ది వెంకట సుభాష్ గణేష్ చౌదరితో ప్రాణహాని ఉందని గోపరాజు తెలిపారు. ఈ విషయమై సీఎం, డీజీపీ కార్యాలయాలకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తనపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని గోపరాజు వేడుకున్నారు.


