నీటి మూటలా సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలు ఆక్వా ల్యాబ్, ఆక్వా హబ్ ఉత్త మాటే కలుషిత మంచినీటి సమస్య పరిష్కారం కలే టిడ్కో కాలనీపై చిన్న చూపు
గుడివాడలో కనిపించని అభివృద్ధి జాడ
గుడివాడరూరల్: గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నీటిమూటలుగా మిగిలాయి. రెండేళ్ల కాలంలో ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమనే చెప్పాలి. సామాన్య నిరుపేదలకు ప్రభుత్వం వల్ల ఒరిగిందేమి లేదు. కనీస మౌలిక వసతులైన రోడ్లు, తాగునీరు ప్రజలకు అందని ద్రాక్షగా మారాయి. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గం దేశవ్యాప్తంగా ఆక్వా రంగానికి పెట్టింది పేరుగా ఉంది. ఎన్నికల హామీల్లో ఆక్వా పరిశ్రమకు ఇచ్చిన ఒక్క హామీ సక్రమంగా నెరవేరింది లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ మంజూరు చేస్తామని, యూనిట్ రూ.1.50కే విద్యుత్ అందజేస్తామని చెప్పారు. రెండేళ్లు గడుస్తున్నా ఇంత వరకు హామీని అమలు చేసిన దాఖలాలు లేవు. దీంతో ఆక్వా రైతులపై అధిక భారం పడుతుంది.
హబ్ లేదు.. ల్యాబ్ ఊసే లేదు..
గుడివాడ పరిసర ప్రాంతాల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేసి అన్ని రకాల సౌకర్యాలు వాటిలో కల్పించి, ఉచితంగా ఆక్వా రైతులకు పరీక్షలు లభించే విధంగా 100 ఎకరాల విస్తీర్ణంలో ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు నీటిమూటలుగా మిగిలాయి. ఆక్వా హబ్‌గా గుడివాడ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని సైతం అమలు చేసిన దాఖలాలు లేవు. రెండేళ్ల కూటమి ప్రభుత్వంలో ఆక్వా రైతుల నుంచి అన్ని రకాల పన్నుల రూపంలో ఆదాయం దండుకోవడమే కానీ వారికి ప్రభుత్వం కల్పించిన వసతులు శూన్యం. దీని ప్రభావంతో ఆక్వా రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు.
నీటి సమస్యకు పరిష్కారమేది?
గుడివాడ నియోజకవర్గ పరిధిలోని నందివాడ, గుడివాడరూరల్ మండలాల్లోని పంట పొలాలు చేపల చెరువులుగా మారడంతో గ్రామాల్లో కలుషిత మంచినీటి సమస్య కొరలు చాచింది. ముఖ్యంగా నందివాడ మండలంలోని 23గ్రామాల్లో ఏ గ్రామంలోనూ మంచినీటి చెరువుల నుంచి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించే పరిస్థితి లేదు. తాగునీటి మాట దేవుడెరుగు.. వాడుక నీరు సైతం లేకపోవడంతో గ్రామస్తులు పాలు మాదిరిగా నీటిని కొనుగోలు చేసే పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కలుషిత మంచినీటి సమస్య పరిష్కారానికి జనార్దనపురం గ్రామంలో 100ఎకరాల విస్తీర్ణంలో భూమిని సేకరించి అదే ప్రాంతం నుంచి మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని అందించేందుకు మెగా రక్షిత మంచినీటి పథకాన్ని నిర్మించే విధంగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అడుగులు వేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకానికి మంగళం పాడేసింది.
టిడ్కో కాలనీలో అభివృద్ధి శూన్యం..
సింగపూర్ మాదిరిగా టిడ్కో కాలనీలను అభివృద్ధి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇళ్ల అభివృద్ధిని గాలికి వదిలేసింది. 2014నుంచి 2019 వరకు ఇళ్లను అసంపూర్తిగా నిర్మించి ఏ ఒక్క గృహం ప్రజలకు ఇవ్వకుండా లబ్ధిదారులను ఇబ్బందుల పాలు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో టిడ్కో కాలనీలకు అధిక నిధులు కేటాయించి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడమే కాకుండా గృహాలకు లేని నిరుపేదలైన ప్రతి ఒక్కరికీ ప్లాట్లతో పాటు ఇళ్ల స్థలాలను కేటాయించారు. వారికి అవసరమైన కనీస మౌలిక వసతులైన రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు, విద్య, వైద్యం తదితర సౌకర్యాలను దాదాపుగా పూర్తి చేశారు. టిడ్కో కాలనీల్లో మిగిలిన వసతులు పూర్తి చేసే సమయంలో వైఎస్సార్ సీపీ అధికారం కోల్పోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టిట్కో కాలనీల అభివృద్ధి మరుగున పడింది. రెండేళ్ల కాలంలో అంతర్గత రోడ్లు, ఇతర సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టిసారించకపోవడంతో కాలనీల్లో సమస్యలు తిష్టవేసి, కాలనీల్లో నివాసముంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ కాలనీ వాసులు వేడుకుంటున్నా కూటమి ప్రభుత్వం స్పందించడం లేదంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు సార్లు వచ్చినా..
ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి హోదాలో గుడివాడ నియోజకవర్గానికి వచ్చిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి శనివారం వస్తున్నారు. ఈసారైనా ఇచ్చిన హామీలు నెరవేర్పు దిశగా అడుగులు వేయాలని, పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


