కేసరపల్లి(గన్నవరం): మండలంలోని కేసరపల్లిలో హెచ్‌సీఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఈఎస్‌ఎస్‌సీఐ) సహకారంతో ఏర్పాటు చేసిన యువకేంద్రం, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రారంభోత్సవం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, స్వర్ణ ఆంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సీహెచ్ కుటుంబరావుతో కలిసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ కేంద్రంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు శిక్షణ నిమిత్తం 619 మంది యువతి, యువకులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి షేక్ షాహిద్‌బాబు, హెచ్‌సీఎల్ టెక్ విజయవాడ హెడ్ శివప్రసాద్, ఈఎస్‌ఎస్‌సీఐ వైస్ ప్రెసిడెంట్ నరోజ్ పాల్గొన్నారు.
గన్నవరం: రకికెట్ మ్యాచ్ వివాదంలో ఓ యువకుడి మృతికి కారణమైన వ్యక్తిని శుక్రవారం గన్నవరం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ నెల 14న స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో క్రికెట్ మ్యాచ్ విషయమై తలెత్తిన వివాదంలో ఈడే వెంకటరామచంద్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితుడైన పడమట దృశంత్ అలియాస్ రాకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక 12వ అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించడంతో స్థానిక సబ్‌జైలుకు తరలించారు.
ఏలూరు టౌన్: ఏలూరు శివారు జాతీయ రహదారి సమీపంలోని ఇంద్రప్రస్థ వద్ద మోటారుసైకిల్ అదుపుతప్పి ఓ యువతి దుర్మరణం పాలయ్యింది. వివరాలిలా ఉన్నాయి.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి చెందిన వేముల జయంతి అనే యువతి, మేనమామ కొండబాబుతో కలిసి మోటార్‌సైకిల్‌పై ఏలూరు వచ్చారు. తిరిగి వెళ్తుండగా శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఘటనా స్థలం వద్ద మోటారు సైకిల్ అదుపుతప్పింది. దీంతో జయంతి, కొండబాబుకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో పడి ఉన్న క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ నందకిషోర్ అటు గా వెళ్తూ వెంటనే స్పందించారు. వారిద్దరినీ ఏలూరులోని జీజీహెచ్‌కు తరలించారు. వైద్యు లు పరీక్షించి జయంతి మార్గమధ్యలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎవరూ ముందుక రాకపోవడం, సకాలంలో 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవటంతో యువతి మృత్యువాత పడినట్టు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్‌కి తరలించారు.


