అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య చిట్టినగర్(విజయవాడపశ్చిమ): అత్తింటి వేధింపులతో వివాహత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోరంగం రోడ్డులో చోటు చేసుకుంది. ఘటనపై మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్టినగర్ సోరంగం వద్ద కొరికాని నాగరాజు, నీలిమ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం కాగా, నాగరాజు గత కొంత కాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్యభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో 16వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో నీలిమ తండ్రి కొరగంజి వెంకటరమణకు ఫోన్ చేసింది. భర్తతో పాటు అత్త అనసూయ, తోటికోడలు మంగమ్మ, ఆమె కొడుకు గోవర్ధన్‌లు తనతో గొడవ పడుతున్నారని చెప్పింది. సరే ఉదయం వచ్చి మాట్లాతామని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాగరాజు తమ్ముడు శివకుమార్ వెంకటరమణకు ఫోన్ చేసి వదిన ఇంట్లో రేకుల షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పాడు. దీంతో నాగరాజుకు ప్రశ్నించగా, రాత్రి భోజనాలు చేసిన తర్వాత నిద్రపోయామని, 2.30 గంటల సమయంలో పనికి వెళ్దామని ఇంట్లో చూసే సరికి సీలింగ్‌కి ఉన్న ఇనుప రాడ్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై తండ్రి వెంకట రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏలూరు కాలువలో శవమై తేలిన వృద్ధుడు
తెల్లవారుజామున..
గన్నవరం: ఉంగుటూరు మండలం తేలప్రోలులో మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఓ వృద్ధుడు శుక్రవారం అజ్జంపూడి వద్ద ఏలూరు కాలువలో శవమై తేలాడు. పోలీసుల సమాచారం ప్రకారం.. తేలప్రోలు గ్రామానికి చెందిన ఉద్దగిరి వీరవెంకట్రావు(70) కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్యం, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత మంగళవారం ఇంటి నుంచి వెళ్లిన వెంకట్రావు తిరిగి రాలేదు. ఆయన కోసం కుటుంబ సభ్యులు పరిసరా గ్రామాల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆత్కూరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మండలంలోని అజ్జంపూడి వద్ద ఏలూరు కాలువలో కొట్టుకువచ్చిన శవం వెంకట్రావుదిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతుడు కుమారుడు వెంకట సాంబశివరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన అనారోగ్య, మానసిక సమస్యలు కారణంగా వెంకట్రావు ఏలూరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.