వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరు అరెస్ట్ చోరీ చేసిన 66 గ్రాముల బంగారం స్వాధీనం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పాతబస్తీలో ఒంటరిగా ఉంటున్న ఒక వృద్ధురాలిని హత్య చేసి బంగారం చోరీ చేసిన కేసును వన్‌టౌన్ పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం ఏడీసీపీ జి.రామకృష్ణ, స్థానిక ఏసీపీ దుర్గారావు, సీఐ గుణరాముతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలను తెలిపారు. పాతబస్తీలోని వట్టూరి వారి వీధిలో కొత్తమాసు విజయలక్ష్మి(69) ఒంటరిగా నివసిస్తోంది. భర్త గతంలో మృతి చెందగా.. కుమార్తె అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. వృద్ధురాలికి కుమార్తె రెండు రోజులుగా ఫోన్ చేస్తుండగా ఎత్తకపోవటంతో ఈ నెల 15వ తేదీన విజయవాడలోని తమ బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పి చూడమని సూచించింది. వారు ఆమె ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి.. అది కిటికీలో పడి ఉండటాన్ని గమనించారు. కిటికీ నుంచి లోపలకు చూడగా విజయలక్ష్మి మృతి చెంది విగతజీవిగా పడి ఉంది. ఆమె ఒంటిపై ఉండాల్సిన బంగారు ఆభరణాలు కనపించలేదు. దీనిపై బంధువులు కుమార్తెతో పాటుగా పోలీసులకు సమాచారమందించారు.
బంగారం కోసమే..
పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సాయంతో కేసును విచారించారు. ఆ క్రమంలో దూరపు బంధువైన నులకపేటకు చెందిన మానేపల్లి సోమశేఖర్‌బాబు, అతని కుమారుడైన మైనర్ ఇద్దరూ కలిసి ఈ నెల 14వ తేదీన ఆమెకు ఊపరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఆమె నుంచి బంగారు గొలుసు, గాజులు, దిద్దులు తీసుకొని పరారైనట్లు గుర్తించారు. శుక్రవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 66 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సంఘటన తెలియగానే కొద్ది గంటల్లోనే కేసును ఛేదించినట్లు రామకృష్ణ పేర్కొన్నారు. కేసు ఛేదించటంలో చొరవ చూపించిన వన్‌టౌన్ సీఐ గుణరాము ఇతర సిబ్బంది, వివిధ స్టేషన్ల సీఐలు కొండలరావు (కొత్తపేట) ఉమామహేశ్వరరావు (భవానీపురం)లను రామకృష్ణ అభినందించారు.


