బైక్‌తో సహా కృష్ణానదిలోకి జారిన యువకుడు ఇంకెన్నాళ్లీ ప్రమాదకర ప్రయాణాలని స్థానికుల మండిపాటు
ఎదురుమొండి దీవి(నాగాయలంక): దీవిలోని ఎదురుమొండి నుంచి గొల్లమంద మీదుగా సముద్రతీర గ్రామం జింకపాలెం వెళ్లే ప్రధాన రోడ్డులో ప్రయాణం రోజు రోజుకూ ప్రమాదభరితంగా మారుతోంది. శుక్రవారం ఆ ప్రాంతంలో జరిగిన ఘటన ఆ ప్రమాదాల తీవ్రతను చాటుతోంది. తమ గ్రామం జింకపాలెం నుంచి సాయంత్రం 3.30గంటల సమయంలో కొక్కిలిగడ్డ శశివర్థన్ అనే యువకుడు బైక్‌పై ఎదురుమొండి గ్రామానికి వస్తున్న తరుణంలో రోడ్డు నది కోతకు గురైన ప్రాంతంలో బ్యాలెన్స్ నిలవక బైక్‌తో పాటు కృష్ణానదిలోకి జారిపోయాడు. అయితే ఆ సమయంలో నది పోటు లేకపోవడంతో నది అంచున బైక్ ఆగిపోయింది. అప్రమత్తమైన యువకుడు నీళ్లలోకి పూర్తిగా జారకుండా ఆపగలిగాడు. వెంటనే తేరుకొని తమ గ్రామస్తులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఈలోగా ఆ రహదారి వెంట వెళ్తున్న సమీప గ్రామస్తులు గమనించి యువకుడిని, బైకును రోడ్డుపైకి తీసుకొచ్చారు. నది పోటుపై ఉండి నీరు ఇంకా పైకి ఉన్నట్లయితే యువకుడు బైక్‌తో సహా నదిలోకి వెళ్లిపోయేవాడని స్థానికులు చెబుతున్నారు.
ఇప్పటికే హెచ్చరించిన ‘సాక్షి’
గత మోంథా తుపాను తాకిడికి ఈరోడ్డు గొల్లమంద సమీపంలో పూర్తిగా కృష్ణానదిలో కరిగిపోవడంతో గొల్లమంద, జింకపాలెం ప్రజలకు మరో ప్రయాణ మార్గం లేక భయపడుతూ సాగిపోతున్న వైనంపై పలుమార్లు ‘సాక్షి’ కథనాలతో హెచ్చరించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దీని కోసం రూ.13కోట్లు మంజూ రు అయినట్లు ఏడాది క్రితం ప్రకటించినా ఎలాంటి చర్యలు లేవు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


