విజయవాడ కల్చరల్: వందేమాతర గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జాతీయ నాటక పోటీలో భాగంగా హనుమంతరాయ గ్రంథాలయంలో మంగళవారం ప్రదర్శించిన ‘స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తి గీతం – వందేమాతరం’ నాటకం ఆద్యంతం దేశ భక్తిని చాటింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, కేంద్ర సంగీత నాటక అకాడమీ, సాయిబాబా నాట్యమండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బంకించంద్ర చటర్జీ వందేమాతర గీతం – దాని ప్రభావం, ఉద్యమం – దాని ప్రభావం, స్వాతంత్య్ర సమరయోధుల పోరాట సంఘటనలతో నాటకం సాగింది. బాలగంగాధర తిలక్ పాత్రలో సీహెచ్ లోకేష్, లాలా లజపతిరాయ్ పాత్రలో ఎంఆర్‌ఎస్ శర్మ, బిపిన్ చంద్రపాల్ పాత్రలో సీహెచ్ చాణిక్య, నెహ్రూ పాత్రలో ఎస్. అర్జున్, అల్లూరి సీతారామరాజుగా సాయిశంకర్‌తోపాటు 40 మంది నటీనటులు నాటకానికి ప్రాణప్రతిష్ట చేశారు. ఈ నాటకానికి రచన డాక్టర్ పీవీఎన్ కృష్ణ, దర్శకత్వం సాయి శంకర్ వహించారు. కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ సభ్యురాలు డాక్టర్ ఎస్‌పీ భారతి, విద్యావేత్తలు సీబీఆర్ ప్రసాద్, వి.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.


