భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని నీట్ అభ్యర్థులు, మెడికల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ‘నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్’ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు వినతి పత్రం అందజేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన్ని కలిసి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ప్రయోజనాలే ధ్యేయంగా రూపొందించిన ఎనిమిది ప్రధాన డిమాండ్లతో కూడిన మెమొరాండం ఇచ్చారు. నేషనల్ మెడికల్ కమిషన్ సవరించిన నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కాలేజీ సీట్ల సంఖ్యను 250 వరకు పెంచాలని కోరారు. ప్రైవేట్ మెడికల్ కాలే జీల్లో అక్రమ ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అరుణ్ చౌదరి, వర్కింగ్ ప్రెసి డెంట్ డి.తారకేష్, వైస్ ప్రెసిడెంట్లు కె.వి.పి.ఆర్. పట్నాయక్, ఎస్.అల్తాఫ్, సెక్రటరీ కె.రంగారావు, జాయింట్ సెక్రటరీ ఎ.అనూష, ట్రెజరర్ విజయ రాధిక, వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ రవి సుబ్రహ్మణ్యం, ఎన్.గణపతిరావు తదితరులు ఉన్నారు.


