పెడన: కన్నబిడ్డ ఆదరణకు నోచుకోక.. సర్కారు సాయం చేతికందక.. పరాయి పంచన కూలిపోయిన పాకలో, ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ జీవచ్ఛవంలా బతుకీడుస్తున్న అవ్వకు అధికారులు ఎట్టకేలకు పింఛన్ మంజూరు చేశారు. ‘సాక్షి’లో ఏప్రిల్ 14న ‘కన్న బిడ్డ కాఠిన్యం.. బాబు పాలనలో దౌర్భాగ్యం’ శీర్షికన ప్రచురితమైన వార్తకు స్పందించారు. పెడన మండలం చోడవరం గ్రామానికి చెందిన లింగం రంగమ్మ(87)ను కుమారుడు పట్టించుకోకపోవడంతో సోదరి కుమారుడు నేలకొండపల్లిలో ఉంచి కొన్నాళ్లు చూశారు. ఆ తరువాత ఆమె పింఛన్ కూడా రాకపోవడంతో పట్టించుకోలేదు. మూడు నెలలుగా ఎవరూ చూడకపోవడంతో గాలివాన వచ్చి పడిపోయిన పాకలో ఆ వృద్ధురాలు జీవచ్ఛవంలా ఉంటోంది. పరిసర ప్రాంతాల వారు గమనించి ఏప్రిల్ 13న మచిలీపట్నం ఆర్డీఓ కార్యాలయంలోని రెవెన్యూ క్లినిక్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ‘సాక్షి’లో వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు.
కారణం ఇదే..
వేలిముద్రలు సరిగ్గా పడటం లేదని, ఐరిష్ కూడా పడకపోవడంతో పింఛన్ నిలిచిపోయిందనే విషయం గుర్తించారు. ఇన్‌చార్జి తహసీల్దార్ కె.అనిల్‌కుమార్, సీఐ నాగేంద్రప్రసాద్, ఎంపీడీఓ అరుణకుమారి కుటుంబ సభ్యులను పలుమార్లు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. పింఛన్ వచ్చేలా చూస్తామని, వృద్ధురాలి ఆలనాపాలనా చూడాలని సూచించారు. చోడవరంలో రంగమ్మకు ప్రత్యేకంగా ఒక పాకను నిర్మించి అందులో ఉంచి మంచీచెడ్డా చూసేలా ఒప్పించారు. వృద్ధురాలికి వేలిముద్రలతో సంబంధం లేకుండా పింఛన్ ఇచ్చేలా కలెక్టర్ డీకే బాలాజీ చర్యలు చేపట్టడంతో ఆమెకు మే నెల పింఛన్‌ను ఎంపీడీఓ ఎ.అరుణకుమారి స్వయంగా వెళ్లి అందించారు.


