వ్యాపారవేత్తల అవగాహన సదస్సుకు మంచి స్పందన | - | Sakshi
Sakshi News home page

వ్యాపారవేత్తల అవగాహన సదస్సుకు మంచి స్పందన

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

వ్యాపారవేత్తల అవగాహన సదస్సుకు మంచి స్పందన ఆటోనగర్‌(విజయవాడతూర్పు): సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం ఆటోనగర్‌ ఎంఎస్‌ఎంఈ హాలులో శనివారం నిర్వహించిన వ్యాపారవేత్తల అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. జనరల్‌ మేనేజరు ఏడీ శ్రీనివాస్‌, జీవీఆర్‌కె ప్రసాద్‌ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ రంగ అభివృద్ధికి సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా అందిస్తున్న వివిధ రుణ ఉత్పత్తులు, ప్రభుత్వ ప్రోత్సాహకంతో పాటు బ్యాంకు ద్వారా అందుబాటులో ఉన్న సౌకర్యాలను పారిశ్రామిక వేత్తలకు అర్ధమయ్యే రీతిలో వివరించారు. వ్యాపారవేత్తలకు ఒనకూరే ప్రయోజనాలను వివరించారు. బ్యాంకు ఎప్పుడూ ఎంఎస్‌ఎంఈ రంగానికి అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంధన వినియోగంలో పొదుపు పాటించాలి బర్త్‌డే ఫంక్షన్‌ కోసం వచ్చి మృత్యు ఒడికి...

మచిలీపట్నంఅర్బన్‌: మధ్య పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ ప్రభావం భారత్‌పై పడకుండా ఉండేందుకు ప్రజలు పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ గ్యాస్‌, విద్యుత్‌ వంటి ఇంధనాల వినియోగంలో పొదుపు పాటించాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం మంత్రి.. ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావుతో కలిసి సైకిల్‌పై మచిలీపట్నం బస్‌స్టాండ్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ గృహావసరాలకు సౌరశక్తి వినియోగాన్ని అలవాటు చేసుకోవడంతో సంప్రదాయ ఇంధనాలపై భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రజలు సైకిళ్లు, విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు.

రైతుబజార్‌ సందర్శన

రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఉదయం మచిలీపట్నంలోని రైతు బజార్‌ను సందర్శించారు. మంత్రి అక్కడి విక్రయదారులతో నేరుగా మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణరావుతో కలిసి పలు రకాల కూరగాయలను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుంచె దుర్గాప్రసాద్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పీవీ ఫణికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో డ్రిల్‌ మాస్టర్‌ దుర్మరణం

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌):

బంధువుల ఇంట్లో బర్త్‌డే ఫంక్షన్‌ కోసం సోదరునితో కలిసి ద్విచక్ర వాహనంపై నగరానికి వచ్చిన డ్రిల్‌ మాస్టర్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన విజయవాడ గుణదల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన గోసాల శివరామకృష్ణకు ఇద్దరు సోదరులు ఉన్నారు. శివరామకృష్ణ అన్నయ్య గోసాల వెంకట కృష్ణ, తమ్ముడు గోసాల సుబ్బరామకృష్ణ గుడివాడలో నివాసం ఉంటున్నారు. వీరు శనివారం విజయవాడలో బంధువుల ఇంట్లో బర్త్‌డే ఫంక్షన్‌ కోసం యూనీకార్న్‌ బైక్‌పై వచ్చారు. ఫంక్షన్‌ చూసుకుని తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి గుడివాడ ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఏలూరు రోడ్డు గుణదల విద్యుత్‌ సౌధ సమీపంలో డివైడర్‌ను ఢీ కొట్టారు. దీంతో గోసాల సుబ్బరామకృష్ణ (38) అక్కడికక్కడే మృతి చెందగా గోసాల వెంకట కృష్ణ గాయపడ్డారు. దీంతో ఇరువురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గోసాల శివరామకృష్ణ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చూసేసరికి తమ్ముడు సుబ్బరామకృష్ణ మృతి చెందగా అన్నయ్య వెంకట కృష్ణ గాయాలతో ఉన్నారు. మృతుడు సుబ్బరామకృష్ణ ప్రైవేట్‌ పాఠశాలలో డ్రిల్‌ మాస్టర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు భార్య కుమార్తె ఉన్నారు. గోసాల శివరామకృష్ణ ఫిర్యాదు మేరకు గుణదల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డ్రగ్స్‌ కలిగి ఉన్న ఇద్దరు అరెస్ట్‌

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): డ్రగ్స్‌ కలిగి ఉన్న ఇద్దరు యువకులను విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ శేషయ్యవీధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మంగీలాల్‌ (26), శైతన్‌ (23)ను పోలీసులు గమనించారు. వారిని పరిశీలించగా వారి వద్ద ఆరు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ లభించింది. వారిని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ చేశారు. అనంతరం వారిని అరెస్ట్‌ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement