బీఎస్‌ఎన్‌ఎల్‌ విశ్రాంత ఉద్యోగుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ విశ్రాంత ఉద్యోగుల ధర్నా

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

మచిలీపట్నంటౌన్‌: కేంద్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బీఎస్‌ఎన్‌ఎల్‌ విశ్రాంత ఉద్యోగులు గురువారం ధర్నా నిర్వహించారు. మచిలీ పట్నంలోని బుట్టాయిపేట పాత టెలికం ఎక్స్ఛేంజ్‌ కార్యాలయ ద్వారం వద్ద ధర్నా నిర్వహించి, డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ఆర్థిక సౌలభ్యంతో ముడి పెట్టకుండా 2026 జనవరి ఒకటో తేదీ నుంచి ఇవ్వాల్సిన డీఏను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ అన్ని సదుపాయాలు కల్పించాలని, పే రివిజన్‌ వెంటనే అమలు చేయాలని, కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని, మోసపూరితమైన పెన్షన్‌ వాలిడేషన్‌ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆల్‌ ఇండియా బీఎస్‌ఎన్‌ఎల్‌ పెన్షనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మచిలీపట్నం శాఖ కార్యదర్శి నాగేశ్వరరావు, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ మచిలీపట్నం శాఖ అధ్యక్షుడు ఏడుకొండలు మాట్లాడుతూ ఎన్డీఏ నూతన విధానాలను అమలు చేస్తూ విశ్రాంత ఉద్యోగుల పొట్టలు కొడుతోందని ఆరోపించారు. సంఘ నాయకులు ఎండీ యూనస్‌, ఎస్‌.రంగనాథరావు, కుర్మా శ్రీనివాసరావు, పి.విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement