మరణంలోనూ వీడని బంధం
గూడూరు: అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచిన భర్త మరణాన్ని తట్టుకోలేక గంటల వ్యవధిలో భార్య ప్రాణాలు విడిచిన విషాద ఘటన బుధవారం గూడూరు మండలం కప్పలదొడ్డిలో చోటు చేసుకుంది. గ్రామంలో రైసు మిల్లు నిర్వహిస్తున్న తిరుమలశెట్టి వీర రాఘవరావు(66) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. భర్త తన కళ్లెదుటే ప్రాణాలు విడవటాన్ని జీర్ణించుకోలేకపోయిన భార్య పద్మావతి(61) సొమ్మసిల్లి పడిపోయింది. పద్మావతి పరిస్థితిని గమనించిన బంధువులు ఆందోళన చెందారు. వెంటనే తేరుకుని పెడన పట్టణంలోని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదే సమయంలో రైలు గేటు పడటంతో దాదాపు 20 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో ఆస్పత్రికి వెళ్లే లోపే ఆమె తుదిశ్వాస విడిచారు. జీవితాంతం భర్త అడుగుజాడల్లో నడుస్తూ తోడునీడగా మెలిగిన పద్మావతి.. మరణంలోనూ తోడును వదలకుండా వెన్నంటే అనంతలోకాలకు వెళ్లిపోవడం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


