కోస్ట్‌గార్డ్, నేవీ సిబ్బందితో కలిసి మాక్‌డ్రిల్
కోడూరు: ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అనుమానితుల ఆచూకీ కనిపెట్టేందుకు హంసలదీవి సాగరతీరం వెంట పోలీసులు సాగర్ కవచ్ పేరుతో ప్రత్యేక మాక్‌డ్రిల్ నిర్వహించారు. కోస్ట్‌గార్డు, నేవీ, మైరెన్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సాగర్ కవచ్ భాగంగా తనిఖీలు జరిపారు. పాలకాయతిప్ప మైరెన్ సీఐ సురేష్‌రెడ్డి పర్యవేక్షణలో 50మంది పోలీసులు కోడూరు, నాగాయలంక మండలాల్లోని తీరప్రాంత గ్రామాల్లో పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. కోస్టల్ పోలీసులు, నేవీ అధికారులు ఉగ్రవాదులు, తీవ్రవాదుల రూపంలో వచ్చి తీరప్రాంత గ్రామాల్లోని ఏదో ఒక ప్రాంతంలో దాగుంటారని, పోలీసులు వీరిని ఏవిధంగా కనిపెడతారనే అంశంపై ఈ మాక్‌డ్రిల్ సాగుతుందని సీఐ సురేష్‌రెడ్డి చెప్పారు. వీరిని కనిపెట్టేందుకు పోలీసులు ప్రత్యేక పడవల ద్వారా సముద్రమార్గం వెంట సంచరించారు. సముద్రంలో వేటాడుతున్న పడవులను కూడా తనిఖీ చేశారు. పాలకాయతిప్ప, హంసలదీవి, ఉల్లిపాలెం, రామకృష్ణాపురం గ్రామాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేయడంతో పాటు అపరిచిత వ్యక్తుల వివరాలను సేకరించారు. ఎస్‌ఐలు ఉజ్వల్‌కుమార్, పూర్ణమాధురి, అవనిగడ్డ సబ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.


