వేటకు లంగరు! | - | Sakshi
Sakshi News home page

వేటకు లంగరు!

Apr 15 2026 8:50 AM | Updated on Apr 15 2026 8:50 AM

భృతి ఎవరికి ఇస్తారు..

మచిలీపట్నంఅర్బన్‌: సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం విధించిన వార్షిక నిషేధం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. జూన్‌ 14 వరకు మొత్తం 61 రోజుల పాటు ఈ నిషేధం కొనసాగనుంది. మత్స్య సంపద పునరుత్పత్తి, సంరక్షణ దృష్ట్యా ఏటా ఈ నిషేధాన్ని అమలు చేస్తారు. ఈ కాలంలో మెకనైజ్డ్‌, మోటరైజ్డ్‌ బోట్లు సహా అన్ని రకాల వేట నౌకలు సముద్రంలోకి వెళ్లడం పూర్తిగా నిషేధించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వేటకు వెళితే బోట్లు, వలలు, చేపల సంపద స్వాధీనం చేసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాకు సుమారు 121 కిలోమీటర్ల సముద్ర తీరం ఉండగా, మచిలీపట్నం, కోడూరు, నాగాయలంక, కృత్తివెన్ను మండలాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల్లో 64 మత్స్యకార గ్రామాలు ఉండగా, మొత్తం 1,12,977 మంది మత్స్యకారులు నివసిస్తున్నారు. వీరిలో 38,914 మంది ప్రస్తుతం వేట వృత్తిలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 2,263 వేట బోట్లు ఉన్నాయి.

తీరానికి బోట్లు..

నిషేధ కాలం ప్రారంభం కావడంతో వేట బోట్లు ఒక్కొక్కటిగా తీరానికి చేరుకుంటున్నాయి. రెండు నెలల విరామం కోసం మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

భృతి పంపిణీ ఏది?

వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భృతి అందిస్తోంది. 2023–24 వైఎస్‌ఆర్‌ సీపీ హయాంలో 12,151 మంది మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.12.15 కోట్లు మత్స్యకారుల ఖాతాలోకి నేరుగా జమ చేశారు. 2024–25 సంవత్సరానికి 12,809 మంది అర్హులను గుర్తించినప్పటికీ, ఎన్నికల కోడ్‌ కారణంగా భృతి పంపిణీ చేయలేకపోయారు. అయితే అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రూ.20వేల భృతి ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఇప్పటికీ భృతి ఇవ్వకుండా ఎగనామం పెట్టింది. కాగా 2025–26 నిషేధ భృతి కింద జిల్లాలో 13,077 మంది మత్స్యకారులకు రూ.26.15 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

సముద్రంలో వేట నిషేధం ప్రారంభం

18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మత్స్యకారులు భృతికి అర్హులు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44లక్షలకు లోపు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, పెద్ద మొత్తంలో భూమి లేదా ఆస్తులు ఉన్నవారు అనర్హులు.

Advertisement
 
Advertisement
Advertisement