రెడ్డిగూడెం: పురుగు మందు తాగిన ఘటనలో ఆరు రోజుల క్రితం తల్లి మృతి చెందగా, కుమారుడు మంగళవారం చనిపోయారు. రెడ్డిగూడెం మండలంలోని కుదప గ్రామంలో నివసించే బొర్రా సావిత్రి(74), తిరుపతయ్య (47) తల్లీకుమారులు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల ఎనిమిదో తేదీన ఇంటిలో ఎవరూ లేని సమయంలో సావిత్రి, తిరుపతయ్య పురుగు మందు తాగారు. కొద్ది సేపటికి వారిద్దరిని గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోకి తరలించారు. పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సావిత్రి ఈ నెల తొమ్మిదో తేదీన మృతి చెందింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతయ్య మంగళవారం ఉదయం పది గంటలకు మృతిచెందాడు.
తాగుడుకు బానిసై...
నూజివీడు మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన బొర్రా తిరుపతయ్య కుటుంబం రెండు సంవత్సరాల క్రితం రెడ్డిగూడెం మండలం కుదప గ్రామంలో ఓ ఇంటిని కొనుగోలు చేసి నివసిస్తోంది. తిరుపతయ్య లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తిరుపతయ్య భార్య, కుమారుడు, కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో తల్లి సావిత్రితో కలిసి పురుగు మందు తాగాడు. తిరుపతయ్య కొడుకు ప్రభాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరు రోజుల వ్యవధిలో తల్లీ కుమారులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గుడివాడరూరల్: వృద్ధురాలి ఆత్మహత్యపై కేసు నమోదు చేసినట్లు గుడివాడ తాలూకా పోలీసులు మంగళవారం తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని బొమ్ములూరు గ్రామానికి చెందిన జాస్తి నిర్మలాదేవి (81) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపతోంది. విజయవాడలో పలుమార్లు చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం కుదటపడలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఈ నెల తొమ్మిదో తేదీన ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. అస్వస్థతకు గురైన నిర్వలాదేవిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవల అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తీసుకెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి నిర్మలాదేవి సోమవారం మృతి చెందింది. మృతురాలి పెద్ద కుమారుడు సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గూడూరు: బతుకుతెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన ఒడిశా కూలీ గూడూరు మండలం తరకటూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మంగళవారం పొద్దుపోయాక జరిగిన ఈ ప్రమాదంపై గూడూరు పోలీసులు దర్యాప్తు చేస్తు న్నారు. ఒడిశాకు చెందిన వ్యక్తి తరకటూరుపాలెం సమీపంలోని ఓ రైసు మిల్లులో కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం పని ముగించు కుని విజయవాడ–మచిలీపట్నం రోడ్డు దాడుతుండగా విజయవాడ వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కారు డ్రైవర్ వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ సీహెచ్.దివ్యప్రకాష్ ఘటనా స్థలంలో ముక్కలు ముక్కలుగా పడిపోయి ఉన్న వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, పోస్టు మార్టం నిమిత్తం బందరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. మృతుడు స్థానికుడు కాకపోవడంతో అతని పూర్తి వివరాల కోసం పోసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుడివాడ టౌన్: దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో వ్యవసాయ ఉత్పత్తులు, కనీస మద్దతు ధర నిర్ణయం విధానంపై వాదనలు జరపడం శుభ పరిణామమని రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవ ఖర్చులు, కుటుంబ పనిపై ప్రస్తుత కనీస మద్దతు ధర నిర్ణయం రైతులను ఏమాత్రం ఆదుకోవడం లేదని తెలిపారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ కూడా కనీస మద్దతు ధర ఉండాలని సిఫారసు చేసిందని గుర్తుచేశారు. వాస్తవ ఖర్చులు, కుటుంబ ఖర్చులు, భూమి లీజు, పెట్టుబడి వడ్డీలకు అనుగుణంగా మద్దతు ధర నిర్ణయం సరిగ్గా లేదని పేర్కొన్నారు. ఈ సమస్యను ఎప్పటి నుంచో లేవనెత్తుతున్నామని, కనీస మద్దతు ధర నిర్ణయిస్తే సరిపోదని, ఆ ధర రైతుకు చేరేలా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు ప్రతినిధిగా ఈ విషయంపై సుప్రీంకోర్టులో వాదన జరగడం తాను స్వాగతిస్తున్నాని పేర్కొన్నారు.
వీరులపాడు: తన పొలం పక్కనున్న మొక్కజొన్న పంటకు ఆకతాయిలు నిప్పంటించారని తెలుసు కుని ఆర్పేందుకు వెళ్లిన మహిళ ఆ మంటలు అంటుకుని మృత్యువాత పడిన ఘటన మంగళవారం జరిగింది. మండలంలోని తాటిగుమ్మి గ్రామానికి చెందిన పెనుమూరి అచ్చమ్మ (55) తన 50 సెంట్ల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమె పొలం పక్కనే ఉన్న మొక్కజొన్న పంటకు మంగళవారం సాయంత్రం సమయంలో కొంత మంది ఆకతాయిలు నిప్పంటించారు. ఈ విషయం తెలిసి మంటలను ఆర్పేందుకు అచ్చమ్మ పొలం వెళ్లింది. మంటలను ఆర్పే క్రమంలో అగ్నికీలలు ఒక్కసారిగా ఆమెను అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న అచ్చమ్మ కుమారుడు శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులు పొలం వెళ్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు పలకా మోహన్‌రెడ్డి, రాఘవరెడ్డి, డోర్నాల రవి తదితరులు అచ్చమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


