మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం (ఒలింపిక్ డే) సందర్భంగా జూన్ 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడ్తామని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసో సియేషన్ (ఏపీఓఏ) అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తమ్ తెలిపారు. త్వరలో ఒలింపిక్ జిల్లా సంఘాలకు ఎన్నికలు ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏపీఓఏ జన రల్ బాడీ సమావేశం నగరంలోని ఓ హోటల్‌లో మంగళవారం జరిగింది. సమావేశం అనంతరం జరిగిన పురుషోత్తమ్ విలేకరులతో మాట్లాడారు. 2036వ సంవత్సరంలో ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలన్న భారతదేశ ప్రతిపాదితకు గుర్తుగా జూన్ 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 2,036 మొక్కలను నాటాలని నిర్ణయించామన్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) మార్గదర్శకాలకు అనుగుణంగా చిత్తూరు జిల్లాకు చెందిన విశ్రాంత బ్యాంక్ మేనేజర్, మాజీ జాతీయ హాకీ క్రీడాకారుడు డి.ఎస్.వెంకటరామనాయుడును ఏపీఓఏ ముఖ్య కార్యనిర్వహణాధి కారిగా (సీఈఓ) ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఒలింపిక్ సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఐఓఏ నుంచి ఆర్థిక సహాయంతో జిల్లా, రాష్ట్ర, దక్షిణ మండల (సౌత్ జోన్) స్థాయిలలో ఒలింపిక్ తరహా పోటీలను నిర్వహించడానికి ఏపీఓఏ ప్రణాళిక రూపొందిస్తోందని వివరించారు. మేఘాలయలో జరిగే 39వ జాతీయ క్రీడల్లో ఏపీఓఏ తరఫున రాష్ట్ర జట్లను కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీఓఏ ఉపాధ్యక్షులు బడేటి వెంకటరామయ్య, నడెళ్ల బ్రహ్మాజీరావు, కోశాధికారి శ్రీనివాస్, సీఈఓ వెంకటరామ నాయుడు, సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మే 5, 6, 7 తేదీల్లో విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో జరిగే ఐదో ఏపీ కప్ తైక్వాండో స్టేట్ చాంపియన్‌షిప్ పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తమ్


