చిలకలపూడి(మచిలీపట్నం): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఏ ఒక్క సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాదని, అందరి వాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశపు హాలులో జరిగిన సభ కార్యక్రమంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించిన అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నంలో అంబేడ్కర్ భవన్ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ప్రతి మేధావిని ప్రభావితం చేసే వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలకొల్పడానికి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. అంబేడ్కర్ మన జీవితాల్లో అస్పృస్యత లేకుండా అందరూ సమానంగా గౌరవించబడేలా రాజ్యాంగాన్ని నిర్మించగలిగారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటగురుమూర్తి, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, శాసన సభ మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్‌బాబు, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆర్.సి.ఆనంద్‌కుమార్, ఎస్సీ సంఘ నాయకులు ఆదినారాయణ, కొడాలి శర్మ తదితరులు పాల్గొన్నారు.


