ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ కోసం విజయవాడకు చెందిన భక్తులు సోమవారం రూ. 2 లక్షల విరాళాన్ని అందజేశారు. నగరంలోనిపటమటకు చెందిన పి.హరినాథ్‌బాబు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి తన తండ్రి వెంకట సుబ్బయ్య పేరిట రూ.లక్ష, తల్లి నాగమణి పేరిట మరో రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆయనకు అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఇచ్చారు.
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): అంతర్జాతీయ వారసత్వ దినోత్సవం పురస్కరించుకుని నిర్వహిస్తున్న కొండపల్లి బొమ్మల మేళాను విజయవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కొండపల్లి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న కొండపల్లి బొమ్మల మేళా వివరాలను ఆయన సోమవారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ 18న ఖిల్లాపైకి ట్రెక్కింగ్ చేసిన అనంతరం బొమ్మల మేళా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రెండోరోజు ఈ మార్కెట్ లీడర్స్, ఈ హ్యాండీక్రాఫ్ట్, కార్టూన్ మేకర్స్, ఆన్‌లైన్ కార్టూన్ సిరీస్‌ను క్రియేట్ చేస్తారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, చుట్టుకుదురు శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్టీటీపీఎస్)ను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ జిష్ణు బారువా సోమవారం సందర్శించారు. నూతన 800 మెగావాట్లు ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం వంటి చర్యలను పరిశీలించారు. ప్రాంతీయ విద్యుత్ గ్రిడ్ల సమీకృత కార్యకలాపాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఏపీజెన్కో డైరెక్టర్ (థర్మల్) అశోక్ కుమార్‌రెడ్డి, జనరేషన్/విద్యుత్ సౌధ చీఫ్ ఇంజినీర్ సుధీర్‌బాబు, ఎన్టీటీపీఎస్ సీఈ పి.శివ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో జలధార పథకం ద్వారా భూగర్భ జలాల మట్టం పెంపునకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని చెరువుల పూడికలను ఉపాధి హామీ పథకం కింద తీసేందుకు మంజూరు ఉత్తర్వులు సిద్ధం చేయాలన్నారు. చిన్న నీటిపారుదల చెరువు కట్టల వెంబడి వీలైనంత ఎక్కువగా రీచార్జ్ సాఫ్టులను, పర్క్యులేషన్ ట్యాంకుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు నీరు వృథాగా పోకుండా చూడాలన్నారు. మురుగునీటి కాలువల్లో అడ్డంకులను తొలగించి కాంక్రిట్ నిర్మాణంతో పనులు చేపట్టాలన్నారు. నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు. తాడిగడప మునిసిపాల్టీలో భూగర్భజలాల మట్టం పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ ఎంవీ శివప్రసాద్, జలవనరులశాఖ ఎస్‌ఈ గుణకర్, ఈఈలు గంగయ్య, రవికిరణ్, భూగర్భజలశాఖ ఏడీ బిందుశ్రీ తదితరులు పాల్గొన్నారు.


