టెన్త్‌ మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించిన కృష్ణా కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించిన కృష్ణా కలెక్టర్‌

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

మచిలీపట్నంఅర్బన్‌: లేడీ యాంప్తిల్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మూల్యాంకన ప్రక్రియను పరిశీలించి, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. మూల్యాంకన కార్యక్రమంలో మొత్తం 775 మంది సిబ్బంది పాల్గొనగా, అందులో 80 మంది చీఫ్‌ ఎగ్జామి నర్లు, 461 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, 234 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు తదితర అధికారులు పాల్గొన్నారు.

హైవేపై ట్రాలీ లారీ బీభత్సం

కృష్ణలంక(విజయవాడతూర్పు): స్థానిక జాతీయ రహదారిపై నేతాజీ వంతెన వద్ద ట్రాలీ లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా అతివేగంగా నడుపుతుండగా లారీ అదుపు తప్పి ముందు వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు, కారును ఢీకొంది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వారధి వైపు నుంచి ఒక ట్రావెల్స్‌ బస్సు, కారు బెంజిసర్కిల్‌ వైపు వెళ్తున్నాయి. జాతీయ రహదారిపై నేతాజీ వంతెన వద్ద ఉన్న సాయిబాబా గుడి సమీపానికి చేరుకోగానే గుంటూరు జిల్లా తాడేపల్లి వైపు నుంచి ఆటోనగర్‌ వెళ్తున్న ట్రాలీ లారీ మితిమీరిన వేగంతో వచ్చి ట్రావెల్స్‌ బస్సు, కారును వెనుకవైపు ఢీకొట్టింది. దీంతో బస్సు, కారు వెనుకవైపు భాగాలు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి గాయాలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని పరీక్షించి మద్యం తాగినట్లు గుర్తించారు. లారీ డ్రైవర్‌పై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు కృష్ణలంక పోలీసులు తెలిపారు.

విశ్వబ్రాహ్మణ సంఘ ఎన్టీఆర్‌ జిల్లా కార్యవర్గం ఎన్నిక

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్‌ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం రథసారథులుగా సాయికిరణ్‌, మోహన్‌ ఎన్నికయ్యారు. విజయవాడలో నిర్వహించిన సంఘ ఎన్నికల్లో సింహం గుర్తుపై పోటీ చేసిన కిరణ్‌ – మోహన్‌ ప్యానల్‌ 915 ఓట్లతో ఘన విజయం సాధించింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా పి.సాయి కిరణ్‌, కందుకూరి మోహన్‌ను ప్యానల్‌ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విశ్రాంత గ్రేడ్‌–2 ఆఫీసర్‌ వినుకొండ భవానీ దుర్గా ప్రసాద్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో సంఘ ఆహ్వాన కమిటీ చైర్మన్‌ చల్లాల శివాజి, అధ్యక్షుడు మునగంటి కామేశ్వరరావు, రామకృష్ణ, శ్రీను, విజయవాడ నగర అధ్యక్షుడు గొర్తి శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్‌, మోహన్‌లు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణ సంఘీయులను కలిసి వారందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి సంఘం బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. సంఘీయుల సమస్యలను పరిష్కరించి వారి అభ్యున్నతి కోసం పాటుపడతామని తెలిపారు.

యువతకు నైపుణ్య శిక్షణ.. ఉపాధి అవకాశాలు

మచిలీపట్నంఅర్బన్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ డి.ఆర్‌.కె.ప్రసాద్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘యూత్‌ ఫర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ అండర్‌ డీడీయూజీకేవై’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంతో నిరుద్యోగ యువతకు పరిశ్రమ అవసరాలకు అనుగు ణంగా శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పి స్తామని పేర్కొన్నారు. అర్హులైన, ఉత్సాహవంతులైన అభ్యర్థులను ఎంపిక చేసి మూడు నెలల నివాస ఆధారిత శిక్షణను అందించడంతో పాటు ఉచిత నివాసం, భోజన సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికెట్‌తో పాటు ప్లేస్‌మెంట్‌ సహకారం కూడా అందిస్తామని తెలిపారు. మెడికల్‌ కోడింగ్‌, సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ సర్వీసెస్‌, మార్కెటింగ్‌, వేర్‌హౌస్‌ ఆపరేషన్స్‌, అన్‌ ఆర్‌మ్డ్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌, జీఎస్టీ అకౌంట్స్‌ వంటి విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న యువత తమ బయోడేటాను ఈ నెల 22వ తేదీలోగా వాట్సాప్‌ 91826 09909 నంబర్‌కు పంపాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement