చిట్టినగర్(విజయవాడపశ్చిమ): విజయవాడ కార్పొరేషన్ ఉద్యోగి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై కొత్తపేట పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ రూరల్ మండలం అంబాపురానికి చెందిన సవలం విఠల్ కిషోర్, సాయినాగ రేణుక భార్యభర్తలు. విఠల్ కిషోర్(34) విజయవాడ నగర పాలక సంస్థలో చెత్త లారీ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. ఈ నెల 4వ తేదీన విఠల్ కిషోర్ ఇంటి నుంచి డ్యూటీకి వెళ్లి తిరిగి రాలేదు. మధ్యాహ్నం విఠల్ కిషోర్‌కు భార్య ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. బంధువులు, స్నేహితులు, తెలిసిన వారిని విచారించినా ఫలితం లేకపోయింది. సోమవారం ఉదయం బంధువు కొర్రపాటి గాంధీ ఫోన్ చేసి పాముల కాల్వ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడని చెప్పాడు. దీంతో పాముల కాల్వ వద్దకు చేరుకున్న రేణుక బంధువుల సాయంతో ఆ మృతదేహాన్ని పరిశీలించి అది తన భర్త విఠల్ కిషోర్‌దిగా గుర్తించారు. దీంతో ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


