గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్మార్ట్ కిచెన్ల పేరుతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుకు అప్పగించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్మార్ట్ కిచెన్ల పేరుతో కార్మికులను రోడ్లపై పడేయొద్దంటూ ఆందోళన వ్యక్తం చేసింది. పథకాన్ని ప్రైవేటుకు అప్పగించొద్దంటూ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో ఆందోళన కార్యక్రమం జరిగింది. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సుశీల, ఎన్‌సీహెచ్ సుప్రజ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథక నిర్వహణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ప్రభుత్వ బాధ్యత లేకుండా ప్రైవేటుకు అప్పగిస్తే నాణ్యత లోపిస్తుందన్నారు. ఇప్పటికే ప్రైవేటు సంస్థలైన అక్షయ పాత్ర, ఇస్కాన్ వంటి ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న చోట పిల్లలు చల్లారి పోయిన, చప్పటి భోజనం తినలేక పడేస్తున్నారన్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవి..
రాష్ట్ర వ్యాప్తంగా కిచెన్ షెడ్లు లేని పాఠశాలలో కిచెన్ షెడ్లు నిర్మించాలని, పథకం అమలుకు మౌలిక సౌకర్యాలు (మంచినీరు, గౌజులు, మాస్కులు, యాప్రాస్) కల్పించాలని, పథకం నిర్వహిస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ. 10వేల వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఒక్కో విద్యార్థికి రూ.20 మెస్ చార్జీలు ఇవ్వాలన్నారు. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సీఐటీయూ నాయకులు ఎ. వెంకటేశ్వరరావు, యూనియన్ నాయకులు డి.పద్మ, దుర్గాభవానీ, కె. రాజేశ్వరి, కుమారి, సావిత్రి, మహేశ్వరి, దుర్గ, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ డిమాండ్


