రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు ప్రయాణంలో గర్భిణికి నొప్పులు రావటంతో తక్షణమే స్పందించిన మహిళా టీటీఐ అందుబాటులో ఉన్న ఇతరుల సహకారంతో రైలులోనే సుఖప్రసవం చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలివి.. ఆదివారం అలప్పుజ–ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ (13352)లో బీ1 కోచ్‌లో తన కుటుంబంతో కలసి గర్భిణి ప్రయాణిస్తోంది. రైలు అన్నవరం స్టేషన్ దాటిన కొద్ది సేపటికే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. ఆమె కుటుంబ సభ్యులు విధుల్లో ఉన్న మహిళా టీటీఐ జి.జ్యోతికి విషయం చెప్పారు. వెంటనే ఆమె స్పందించి కమర్షియల్ కంట్రోలర్‌తో సమన్వయం చేసుకుంటూ, వైద్యుల సూచనలను పాటిస్తూ అందుబాటులో ఉన్న మహిళల సహకారంతో గర్భిణికి ప్రసవం చేయడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రైలును యలమంచిలి స్టేషన్‌లో అత్యవసరంగా నిలిపివేసి 108లో తల్లి, బిడ్డను యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వారు ఆరోగ్యంగా ఉన్నారు. దీనికి సహకరించిన మహిళా టీటీఈ, సీనియర్ సీసీటీసీ బిపుల్‌కుమార్, జుబేర్ ఖాన్‌లను రైల్వే డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా అభినందించారు.


