బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు | - | Sakshi
Sakshi News home page

బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు

Apr 7 2026 9:31 AM | Updated on Apr 7 2026 9:31 AM

బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి జగనన్న కాలనీ(ఈలప్రోలు)లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆ కాలనీ వాసులు కొండపల్లి మునిసిపాలిటీ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలు, బకెట్లతో సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసి లక్ష్మీదేవి మాట్లాడుతూ కాలనీలో కనీసం తాగునీరు లేదని ఆరోపించారు. బిందెడు నీటి కోసం కిలోమీటర్‌ దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. గుంతల రోడ్డులో నడుస్తూ కిందపడి ఆస్పత్రుల పాలవుతున్నట్లు వివరించారు. కనీసం గ్రావెల్‌ రోడ్లు వేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ దృష్టికి కాలనీ సమస్యలు పలుమార్లు తీసుకెళ్లినా ఆయనలో స్పందన లేదని విమర్శించారు. కాలనీలోని ఇళ్లకు ఇంటి పన్నులు వేస్తే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, పాఠశాల, వైద్యశాల సైతం నిర్మించాలని కోరారు.

సీపీఎం సంఘీభావం..

కాలనీ వాసులకు సంఘీభావంగా నిలిచిన సీపీఎం పట్టణ కార్యదర్శి ఎం.మహేష్‌ మాట్లాడుతూ కొండపల్లి మునిసిపాలిటీలో అనేక రకాల సమస్యలు ఉన్నాయన్నారు. జగనన్న కాలనీలో ప్రధానంగా రోడ్లు, తాగునీరు డ్రెయినేజీ సమస్యలు ఉన్నాయన్నారు. తాగునీటి పైప్‌లైన్‌కు గతంలో రూ.10లక్షలు మంజూరు అయినట్లు మునిసిపల్‌ చైర్మన్‌ చెన్నుబోయిన చిట్టిబాబు చెప్పారని, ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. మున్సిపల్‌ పాలకవర్గం సభ్యులు కాలనీని సందర్శించినప్పటికీ సమస్య పరిష్కరించడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు. మునిసిపాలిటీలో మద్యం ఏరులైపారుతున్నప్పటికీ కృష్ణానది ఒడ్డున ఉన్న కొండపల్లి మునిసిపాలిటీకి తాగునీరు అందించలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని విమర్శించారు. గతంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌, కలెక్టర్‌ లక్ష్మీశ, గత ఆర్డీవో కావూరి చైతన్య, తహసీల్లార్‌ వెంకటేశ్వర్లుకు కాలనీలో సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఎవరూ స్పందించకపోవడం దారుణమన్నారు.

కొండపల్లి మునిసిపల్‌ కార్యాలయం వద్ద ప్రజల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement