మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి శాప్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిద్దిడానికి ఖేలో ఇండియా నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్), విజయవాడ నగర పాలక సంస్థ సంయుక్తంగా పనులు చేపట్టనున్నారు. ఈ స్టేడియంలో వివిధ క్రీడాంశాలకు సంబంధించిన కోర్టులను నిర్మాణం చేయడానికి గాను రూ.60 కోట్ల విలువైన పనులను చేయాలని శాప్ ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందించారు. ఈ అభివృద్ధి పనులకు ఖేలో ఇండియా నుంచి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. ఈనెల 8వ తేదీ బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొని భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు.
మూడు దశలు... రూ.60 కోట్లతో పనులు
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని రూ.60 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ఇప్పటికే రూ.20 కోట్లను ఖేలో ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మిగిలిన రూ.40 కోట్లను శాప్, విజయవాడ నగరపాలక సంస్థ ఖర్చు చేయనున్నాయి. మొదటి దశలో స్టేడియం లోపలి భాగంలో ఫుట్‌బాల్ గ్రీన్ ఫీల్డ్ కోర్టు, 4–టెన్నిస్ కోర్టులు, 2–వాలీబాల్ కోర్టులు, 2–బాస్కెట్ బాల్ కోర్టులు, హ్యాండ్‌బాల్ కోర్టులు, 400, 200 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్స్ నిర్మాణం చేస్తారు. రెండో దశలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, మూడో దశలో పరిపాలన భవనాలు, జిమ్‌తో పాటుగా ఫిజియోథెరఫీ సెంటర్ నిర్మాణం చేయనున్నారు. మొదటి దశ పనులకు సంబంధించి బుధవారం భూమి పూజ జరుగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం స్థలం కార్పొరేషన్ ఆధీనంలో ఉండటంతో కార్పొరేషన్‌తో శాప్ ఒప్పందం చేసుకుని కార్పొరేషన్, శాప్ సంయుక్తంగా ఈ పనులను చేపట్టనున్నాయి.


