ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ‘మీకోసం’ | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ‘మీకోసం’

Apr 7 2026 9:31 AM | Updated on Apr 7 2026 9:31 AM

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ‘మీకోసం’ అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ట్రాక్టరు

కోనేరుసెంటర్‌: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మీకోసం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. వృద్ధులు, వికలాంగులతో మర్యాదగా మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఎస్పీ మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరికొన్ని అర్జీలను ఫోన్‌లలో మాట్లాడి పరిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ అన్యాయానికి గురైన బాఽధితులకు న్యాయం చేయటమే పోలీసుల కర్తవ్యమని అన్నారు. మీకోసంలో అందిన ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపుతామన్నారు. న్యాయం కోసం వచ్చే బాధితుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా మసలుకోవాలన్నారు. మీకోసంలో 35 అర్జీలు అందినట్లు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ వి.వి.నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిలుకూరు(ఇబ్రహీంపట్నం): గేదెలు కాసేందుకు వెళ్లిన వ్యక్తి తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మేతకు వెళ్లిన గేదెలు సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగి రాగా, వాటిని తోలుకెళ్లిన యజమాని ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ముళ్ల పొదల మాటున ఓ ప్రాతంలో ముఖం, శరీరంతో పాటు ప్రైవేట్‌ పార్ట్‌ల వద్ద గాయాలతో విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. అతని పక్కన పెద్దసైజు బండ రాళ్లు ఉండటంతో రాళ్లతో కొట్టి చంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సేకరించిన వివరాల మేరకు మండలంలోని చిలుకూరు గ్రామానికి చెందిన గుడిశ అమరలింగేశ్వరావు(48) కుటుంబ పోషణ కోసం లారీ డ్రైవర్‌గా పనిచేస్తూనే గేదెలను పెంచుతుంటాడు. ప్రతిరోజు అతని భార్య గేదెలను మేతకు తోలుకెళ్తుంటుంది. ఆమెకు వేరే పని ఉండటంతో సోమవారం ఆమె భర్త అమరలింగేశ్వరరావు గేదెలు తోలుకెళ్లాడు. సాయంత్రం గేదెలతో పాటు అతను ఇంటికి రాకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని ముళ్లపొదల్లో గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న గంజాయి బ్యాచ్‌ హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, యుక్త వయస్సు వచ్చిన ఇద్దరు కుమారులు ఉన్నారు.

జి.కొండూరు: మండలంలోని భీమవరప్పాడు గ్రామానికి చెందిన ట్రాక్టరు కోడూరు వైపు నుంచి వస్తూ టైరు పగలడంతో అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో ట్రక్కు మాత్రమే పక్కకి బోల్తాపడి ఇంజిన్‌ పడకపోవడంతో ట్రాక్టరు నడుపుతున్న రాము అనే వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ట్రాక్టరు ట్రక్కులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement