మచిలీపట్నంఅర్బన్: కార్మికుల ప్రాణాలకు విలువ లేకుండా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే పోరాటాలకు సిద్ధమని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్లపల్లి వేణుగోపాలరావు హెచ్చరించారు. కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద భవన నిర్మాణ కార్మికులు సోమవారం ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అమలు చేయకపోతే భవన నిర్మాణ కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతామని స్పష్టం చేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని విమర్శించారు. గతంలో అమలులో ఉన్న పెళ్లి కానుక, డెలివరీ బెనిఫిట్, ఆసుపత్రి ఖర్చులు, అంగవైకల్య భత్యం, విద్యా స్కాలర్‌షిప్, సహజ మరణం, ప్రమాద మరణం, అంత్యక్రియలు, నమోదు కాని ప్రమాద మరణాలకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 1 నుంచి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం, చివరికి కేవలం నాలుగు పథకాలకే పరిమితం కావడం భవన నిర్మాణ కార్మికులకు చేసిన ఘోర మోసమని మండిపడ్డారు. వెల్ఫేర్ బోర్డులో వేల కోట్ల రూపాయల నిధులు నిల్వ ఉన్నప్పటికీ, కార్మికులకు కనీస భద్రత కూడా కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో ప్రమాద మరణానికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లిస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం వివాహ కానుక, ప్రసవ కానుక, సహజ మరణం, మట్టి ఖర్చులకే పరిమితం చేయడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. అర్హులైన కార్మికుల నుంచి స్వీకరించిన అన్ని అప్లికేషన్లకు సంబంధించిన క్లెయిమ్‌లను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా క్లెయిములు అమలు కాకపోవడంతో అనేక మంది కార్మికులు వెల్ఫేర్ బోర్డులో రెన్యూవల్స్ చేయించుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొత్త సభ్యత్వాలు చేపట్టి, గతంలో సభ్యులుగా ఉండి రెన్యూవల్ గడువు ముగిసిన వారికి మళ్లీ అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజనాల సురేష్, కోశాధికారి వేము పెదబాల, సీఐటీయూ నాయకులు జయరావు, చంద్రపాల్, మీరావలి, టి.నాగ, ఆర్.కొండ, కె.రాణి, పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.


