జగ్గయ్యపేటఅర్బన్: జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ సహకారంతో ఈనెల 5 వ తేదీన పేటలోని మున్సిపల్ స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించిన డీఎస్‌ఏ స్విమ్మింగ్ చాంపియన్స్– 2026 పోటీలలో జగ్గయ్యపేటకు చెందిన డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్(డీఎస్‌ఏ) ఘన విజయం సాధించి ఎన్టీఆర్ జిల్లా చాంపియన్ షిప్‌ను కై వసం చేసుకుంది. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొత్తం 19 జిల్లాలకు చెందిన 215 మంది స్విమ్మర్లు పాల్గొన్నారు. 25 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వయస్సు గల క్రీడాకారులు పాల్గొనడం విశేషం. ఇందులో 52 శాతం మహిళలు పాల్గొనడం గమనార్హం. ముఖ్యంగా 87 ఏళ్ల వయస్సు గల ఒక మహిళ స్వర్ణ పతకం గెలుచుకోవడం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎన్టీఆర్ జిల్లా నుంచి 31 మంది మహిళలు, 40 మంది పురుషులు కలిసి మొత్తం 66 మంది పాల్గొని 101 స్వర్ణ పతకాలు, 56 రజత పతకాలు, 52 కాంస్య పతకాలు కలిపి మొత్తం 209 పతకాలు సాధించారు. దీనిలో జగ్గయ్యపేట డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ నుంచి 26 మంది మహిళలు, 13 మంది పురుషులు మొత్తం 39 మంది పోటీలలో పాల్గొని 78 స్వర్ణ, 34 రజత, 25 కాంస్యం కలిపి మొత్తం 137 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన బహుమతి ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో కలిసి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం తేజస్వి పొడపాటి మాట్లాడుతూ 85 ఏళ్లు పైబడిన మహిళలు కూడా పాల్గొని పతకాలు సాధించడం తనకు ప్రేరణ ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్లెల సీతమ్మ, మున్సిపల్ కమిషనర్ డీటీవీ కృష్ణారావు, సీఐ పి.వెంకటేశ్వర్లు, డీఎస్‌ఏ నిర్వహణ కమిటీ, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


