కోనేరుసెంటర్: రాబోయే రోజుల్లో తాగు, సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత నీటి సంఘాలు, ప్రజలపై ఉందని రాష్ట్ర గనులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి సోమవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణలతో కలిసి బందరు మండలంలోని పొట్లపాలెం గ్రామ పంచాయతీలోని కొత్తపూడి గ్రామ చెరువులో పూడికతీత పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని చెరువులను గుర్తించి అందులో పూడిక తీత పనులను చేపట్టాలన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ చెరువుల్లో నీటిని నింపుకోవడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాల మట్టం పెరుగుతుందన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని నీటిని నిలువ చేసుకొని శుద్ధిచేసి పొదుపుగా ప్రతి ఇంటికి సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ శివప్రసాద్, జలవనరుల శాఖ ఎస్‌ఈ గుణకర్, భూగర్భ జల శాఖ డీడీ బిందుశ్రీ, జలవనరుల శాఖ ఈఈ రవికిరణ్, డీఈఈ అపర్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ సుధాకర్, ఏఈ సుగుణ, తహసీల్దారు నాగభూషణం, డెప్యూటీ ఎంపీడీవో బాలకృష్ణరావు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్, జిల్లా నీటి సంఘాల అధ్యక్షుడు దేవన బోయిన వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ గణేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, స్థానిక నాయకులు, పలు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.


