గలీజు దందా | - | Sakshi
Sakshi News home page

గలీజు దందా

Feb 19 2026 9:39 AM | Updated on Feb 19 2026 3:36 PM

పత్తా

పత్తాలేని అధికారులు

ఎమ్మెల్యే పేరుతో బరితెగించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు 

రైతుల అంగీకారం లేకుండా చెరువును అడ్డగోలుగా తవ్వేస్తున్న వైనం 

భూములు ఉన్న వెనుకబడిన, బలహీన వర్గాల రైతులకు బెదిరింపులు 

అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్న బాధితులు

గుడివాడరూరల్‌: టీడీపీ నాయకుడు ఒకరు బరితెగించారు. నిరుపేదల భూముల్లో వారితో లీజు అగ్రి మెంట్‌ చేయించుకోకుండా ఎమ్మెల్యే తన వెనక ఉన్నారంటూ అడ్డగోలుగా చెరువులో పూడికతీసి గట్లను పటిష్టం చేస్తున్నారు. ఇదేమి అన్యాయమంటూ అడిగిన పేదలను దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారు. తమ భూములను నెల రోజులుగా దౌర్జన్యంగా తవ్వేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం గుడివాడ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

ముగిసిన లీజు

నందివాడ మండలంలోని పోలుకొండ గ్రామ శివారు నాగభూషణపురం గ్రామంలో 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని రెండు దశాబ్దాల క్రితం విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చేపల చెరువుగా మార్చారు. ఈ భూముల్లో అత్యధికం గ్రామంలోని నిరుపేద ఎస్సీలకు చెందినవే. ఆ పారిశ్రామికవేత్త భూముల యజమానుల నుంచి లీజుకు తీసుకున్నారు. చెరువు తవ్వినప్పటి నుంచి క్రమం తప్పక లీజు సొమ్ము చెల్లించారు. ఆయన తీసుకున్న లీజు గడువు ముగిసిన తర్వాత గుడివాడకు చెందిన టీడీపీ నాయకుడికి సదరు రైతులు నిబంధనల ప్రకారం లీజుకు ఇచ్చారు. ఈ లీజు ప్రక్రియ ప్రస్తుతం ముగి సింది. లీజు నిబంధనల ప్రకారం సదరు నేత రైతుల అంగీకారంతో మరో సారి లీజు తీసుకోవాలి.

బెదిరింపుల పర్వం

ఎస్సీల భూములకు సంబంధించి గుడివాడకు చెందిన టీడీపీ నేత కుదుర్చుకున్న లీజు గడువు ముగిసింది. గడువు ముగిసినందున ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికే రైతులు చెరువును లీజుకు ఇచ్చుకోవచ్చు. గుడివాడకు చెందిన ఓ వ్యక్తి ఎకరాకు రూ.లక్ష చెల్లించేందుకు ముందుకొచ్చారు. కొంత మంది రైతులకు ఇప్పటికే రూ.లక్ష చొప్పున చెల్లించారు. లీజు గడువు ముగిసిన టీడీపీ నాయకుడు మళ్లీ రంగంలోకి వచ్చాడు. తనకే ఆ భూములను లీజుకు ఇవ్వాలని, ఎకరాకు రూ.80 వేలు మాత్రమే చెల్లిస్తానని, తనను కాదని ఎవరికై నా ఇస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాడు. తనకు అధికార పార్టీ అండదండలు ఉన్నాయని, తాను ఎంత చెబితే అంతే లీజుకు ఇవ్వాలని, లేనిపక్షంలో చెరువును సాగు చేసుకోనివ్వనని భీష్మించాడు. అంతేకాదు రైతులను బెదిరించి వారితో లీజు కుదుర్చుకోకుండా నెలరోజుల నుంచి చెరువును యథేచ్ఛగా తవ్వేస్తూ మరమ్మతులు చేపట్టాడు. తాము లీజుకు ఇవ్వకపోయినా తమ భూముల్లో చెరువు మరమ్మతులు ఎలా చేపడత్తారని ప్రశ్నించడానికి వెళ్లిన అమాయక ఎస్సీ వర్గానికి చెందిన రైతులపై దౌర్జన్యానికి దిగాడు. కొందరు రౌడీమూకలను వారిపై ఉసిగొలిపి దాడు లకు పాల్పడుతున్నాడు. దశాబ్దాల కాలంగా తమ వంశీకుల నుంచి తాము సాగు చేస్తున్న భూములను దౌర్జన్యంగా తవ్వేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత ఎస్సీ వర్గాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పత్తాలేని అధికారులు 

చంద్రబాబు ప్రభుత్వం చేపల చెరువులకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రవేశపెట్టింది. ప్రతి ఎకరాకు కనీస రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. చెరువుల మర మ్మతులు చేయాలంటే దాని కింద భూములు ఉన్న రైతులు అందరూ అంగీకారం తెలపాలి. 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుకు సంబంధించి 42 ఎకరాల రైతులు లీజుకు ఇవ్వలేదు. అయినా టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే పేరుతో బెదిరిస్తున్నాడు. ఇప్పటికే బాధిత రైతులు కొందరు రెవెన్యూ, మత్య్సశాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారీ స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

మేము పోలుకొండ గ్రామానికి చెందిన నిరు పేద ఎస్సీలం. తాతల కాలం నుంచి బండిరేవులో 44 సెంట్ల భూమి ఉంది. మా భూమిని గుడి వాడకు చెందిన టీడీపీ నేతకు లీజుకు ఇచ్చాం. లీజు కాలం ముగిసింది. మరొకరికి ఎకరాకు రూ.లక్ష చొప్పున లీజుకు ఇచ్చాం. లీజు ముగిసిన టీడీపీ నేత మా అనుమతి లేకుండా చెరువు తవ్వేస్తున్నాడు. ఒప్పుకొంటే ఎకరాకు రూ.80 వేలు ఇస్తామని, లేకపోతే ఒక్కరూపాయి కూడా ఇచ్చేది లేదని బెదిరిస్తున్నాడు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి.

– పి.ప్రసన్న, రైతు పోలుకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement