రైల్వే ఉద్యోగాల పేరుతో బురిడీ
బాధితులపైనే కేసు..
టీడీపీ చోటా నేతల అండదండలతో రైల్వే ఉద్యోగుల దందా 70 మంది నిరుద్యోగుల నుంచి రూ.2.50 కోట్ల మేర వసూలు
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నానికి చెందిన రైల్వే ఉద్యోగి, టీడీపీ చోటా నాయకులు రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు 70 మంది నిరుద్యోగుల నుంచి రూ.2.50 కోట్ల మేర దండుకున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తమ వద్ద నుంచి రూ.లక్షలు వసూలు చేసి మూడేళ్లు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో తాము మోసపోయా మని బాధితులు వాపోతున్నారు. ఇటీవల మోసగించిన రైల్వే ఉద్యోగి ఇంటికి వచ్చి నిలదీయడంతో బండారం బయటపడింది.
బాధితుల కథనం మేరకు.. మచిలీపట్నం రైల్వేస్టేషన్లో వెల్డర్‌గా పనిచేస్తున్న ఎం.కిషోర్ కుమార్ తాను టికెట్ కలెక్టర్‌ను అంటూ కొందరు నిరుద్యోగులను పరిచయం చేసుకున్నాడు. మంత్రి కొల్లు రవీంద్రతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే చిన్నం చిన్నా, గిలకలదిండికి చెందిన టీడీపీ చోటా నాయకుడు రమేష్, విజయవాడ రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగులు కర్మిల, షఫీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. తమ రాజకీయ పలుకుబడితో దొడ్డిదారిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భరోసా ఇచ్చారు. 70 మంది నుంచి విడతల వారీగా రూ.లక్షలు దండుకున్నారు.
చెక్కులు ఇచ్చి దాటవేత
బాధితురాలు నాగ పద్మ మీడియాతో మాట్లా డుతూ.. తాను 2021 ఆగస్టు 20న విజయవాడ కనక దుర్గమ్మ గుడికి వెళ్లిన సందర్భంలో రైల్వే స్టేషన్‌లో కిషోర్ పరిచయమై ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మ బలికాడని తెలిపారు. తనకు, తన కుమారుడికి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫోన్‌పే, బ్యాంక్ అకౌంట్, నగదు రూపంలో కిషోర్ రూ.20 లక్షలు తీసుకున్నాడని వివరించారు. తనకు ఉద్యోగం వచ్చినట్లుగా నకిలీ ధృవపత్రాలు, గుర్తింపు కార్డు సృష్టించాడని, రైల్వే ఉద్యోగుల కోఆపరేటివ్ బ్యాంకులో రుణం కోసం తన పేరుతో దరఖాస్తు చేశానని కిషోర్ తెలిపాడని, ఆ రుణానికి సంబంధించిన మెసేజ్‌లు కూడా వచ్చా యని వివరించింది. డబ్బులు ఇవ్వాలని తాను ఒత్తిడి చేయగా కిషోర్ 2024 మే 27 తేదీతో వీరంకి హరివాసుదేవరావు పేరుతో ఉన్న చెక్కు తనకు ఇచ్చాడని తెలిపింది. ఆ చెక్కు చెల్లకపోవడంతో మచిలీపట్నంలోని కిషోర్ ఇంటికి వెళ్లి డబ్బులు అడిగానన్నారు. డబ్బులు ఇవ్వకపోగా టీడీపీ నాయకుడు చిన్నం చిన్నా అండదండలతో తాము దాడి చేశామని ఆస్పత్రిలో చేరి తమపై ఎదురు కేసు పెట్టాడని వాపో యింది. చిన్నం చిన్నా కూడా పలుమార్లు ఉద్యోగం వస్తుందని నమ్మబలికాడని పేర్కొన్నారు. చివరకు కూర్చుని మాట్లాడి డబ్బులు ఇప్పిస్తానని చెప్పి, తన డ్రైవర్‌ను పంపాడని పేర్కొన్నారు. చిలకలపూడికి చెందిన వేగేశ్న గంగాభవాని మాట్లాడుతూ.. తనకు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని కిషోర్ రూ.2.50 లక్షలు విడతల వారీగా తీసుకుని మూడేళ్లయిందని తెలిపారు. పోలీసులు తమ ఫిర్యాదు మేరకు కిషోర్ అతనికి సహకరిస్తున్న చిన్నం చిన్నా, రమేష్, కర్మిల, షఫీపై కేసు నమోదు చేయాలని కోరింది. తమతో పాటు కిషోర్ చేతిలో మోసపోయిన నిరుద్యోగులకు డబ్బులు ఇప్పించాలని జిల్లా ఉన్నతాధికారులను ఆమె డిమాండ్ చేసింది.
మూడేళ్లు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు కాళ్ల మండలం జక్కరం గ్రామానికి చెందిన కునాధరాజు నాగపద్మ, ఆమె తండ్రి కృష్ణంరాజు, మచిలీపట్నం చిలకలపూడికి చెందిన వేగేశ్న గంగాభవాని ఈ నెల మొదటి వారంలో రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్న కిషోర్‌కుమార్ ఇంటికి వెళ్లి నిలదీశారు. వారిని బెదిరించేలా మాట్లాడిన కిషోర్ ఇప్పుడే వస్తానని బయటకు వెళ్లి తనపై కునాధరాజు నాగ పద్మ, కృష్ణంరాజు, వేగేశ్న గంగాభవాని దాడి చేశారని జీజీహెచ్‌లో చేరాడు. అతని ఫిర్యాదు మేరకు ఆస్పత్రిలోని అవుట్ పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిలకలపూడి పోలీసులు ఆ ముగ్గురిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి మాట్లాడారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేలా అందుబాటులో ఉండాలని వారిని ఆదేశించారు. తాము ముందుగానే కిషోర్ కుమార్‌పై ఫిర్యాదు చేసినా ఎందుకు కేసు నమోదు చేయలేదని బాధితులు అడిగితే ముందు దాడి కేసు తేలితే ఆ తర్వాత మీ కేసు చూద్దామని బదిలిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.


