ముగిసిన నెట్‌బాల్ టోర్నమెంట్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యువత విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాథికార సంస్థ(శాప్) చైర్మన్ ఎ.రవి నాయుడు సూచించారు. స్థానిక మేరీస్ స్టెల్లా కళాశాల ఆవరణలో జరుగుతున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్‌బాల్ టోర్నమెంట్ బుధవారం సాయంత్రం ముగిసింది. సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం జట్టు మొదటి స్థానంలో నిలిచి ట్రోిఫిని సొంతం చేసుకుంది. కాలికట్ విశ్వవిద్యాలయం ద్వితీయ, కృష్ణా విశ్వవిద్యాలయం తృతీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు అతిథులు బహుమతులను అందజేశారు. ముగింపు సభకు రవినాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. శాప్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నుంచి శాప్ లీగ్స్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిభ చూపిన వారికి శాప్ తరఫున శిక్షణ ఇచ్చి, వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామ న్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కూన రాంజీ మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్‌లో వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 90 టీమ్‌లు, 200 మంది కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారని తెలిపారు. కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎన్.ఉష, రెక్టార్ ఎం.వి. బసవేశ్వరరావు, స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ జి. ఇన్యాసమ్మ, కాకినాడ జేఎన్‌టీయూ స్పోర్ట్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జి.శ్యామ్‌కుమార్ పాల్గొన్నారు.


