ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బుధవారం పలువురు భక్తులు విరాళాలను అందచేశారు. సింగపూర్‌కు చెందిన విపిన్ కుమార్, ప్రవీణ్‌కుమారి కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం సమర్పించింది. గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన కొండూరు కృష్ణమూర్తి, ఉమామహేశ్వరి అమ్మవారి నిత్యాన్న దానానికి రూ.1,00,001 విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
రామలింగేశ్వరుడికి రూ.10 లక్షల ఆభరణాలు
పెనమలూరు: మండలంలోని యనమలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీపార్వతి సమేత శ్రీ రామ లింగేశ్వరస్వామికి భక్తులు రూ.10 లక్షలు విలువ చేసే ఆభరణా లను బుధవారం సమర్పించారు. విజయవాడ పటమటకు చెందిన కొడాలి సీతారాంబాబు, ఉషారాణి దంపతులు బంగారపు పూతతో జటాజూటం, నాగాభరణం తయారు చేయించారు. ఆలయ నిర్మాణ దాత సంగా నరసింహా రావు, ఈఓ ఎన్.భవాని పాల్గొన్నారు.
సీబీసీ ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ
కంచికచర్ల: మండలంలోని పరిటాల శివారు దొనబండ నేషనల్ హైవే పక్కన ఏర్పాటు చేసిన రిలయన్స్ న్యూ ఎనర్జీ కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీసీ) ప్లాంట్‌ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ బుధవారం సందర్శించారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాంట్‌ను త్వరలో ముఖ్యమంత్రి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్లాంట్‌లో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. రోజుకు 22 టన్నుల సీజీసీ ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంటును సిద్ధం చేస్తున్నట్లు ప్లాంటు సిబ్బంది తెలిపారు. స్థానిక వ్యవసాయ వ్యర్థాలు, మునిసిపల్ ఘన వ్యర్థాలను ఉపయోగించి పర్యావరణ హిత ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు ఈ ప్లాంటు దోహదం చేస్తుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, ప్లాంట్ డీజీఎం శ్రీకాంత్, ప్లాంట్ మేనేజర్ శ్రీచరణ్, అసిస్టెంట్ మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.


