భూముల రీసర్వేను త్వరగా పూర్తి చేయాలి
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
పామర్రు(పమిడిముక్కల): కృష్ణాజిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న భూముల రీసర్వేను త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వేను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లా డుతూ.. రీ సర్వేకు ముందు రైతులకు నోటీసులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో రీ సర్వే పూర్తి చేస్తున్నామని వివరించారు. భూమి వివరాల నమోదును తప్పుగా సైట్‌లో చూపిస్తే దానిని సరి చేసుకునేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అనే విషయాలను వివరించారు. రైతులు తమ పాస్ బుక్‌లో ఉన్న తప్పులను సరి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. భవిష్యత్‌లో రాబోయే పట్టాదారు పాసు పుస్తకంలో ఏవిధమైన తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రెవెన్యూ అధికారులు, గ్రామ సచివాలయాల సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.


