గుణదల క్షేత్రానికి ఆధ్యాత్మిక శోభ
రేపటి నుంచి మహోత్సవాలు ప్రారంభం పెద్ద ఎత్తున తరలిరానున్న క్రీస్తు విశ్వాసులు ఏర్పాట్లలో నిమగ్నమైన ఆలయ గురువులు
గుణదల(విజయవాడ తూర్పు): దేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండో అతి పెద్ద పుణ్యక్షేత్రం విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయం. తమిళనాడులోని వేళాంగిణీ మాత ఆలయం తరువాత అంతటి విశిష్టత కలిగిన క్షేత్రమిది. ఈ ఆలయంలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి మూడు రోజులపాటు 102వ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో క్రీస్తు విశ్వాసులు తరలిరానున్నారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో మేరీమాత ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్టు విజయవాడ కతోలిక పీఠం బిషప్ రాజారావు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ మేరకు ఆలయ కమిటీ తిరునాళ్ల ఏర్పాట్లకు రంగం సిద్ధం చేసింది. యాత్రికులకు సౌకర్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైంది. అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఉత్సవాలను సమర్థంగా నిర్వహిస్తామని ఆలయ గురువులు చెబుతున్నారు.
లక్షలాదిగా తరలిరానున్న విశ్వాసులు
1937 నుంచీ గుణదల మేరీమాత ఆలయంలో ఉత్సవాలు జరపడం ప్రారంభించారు. కాలక్రమంలో యాత్రికుల సంఖ్య పెరగటంతో పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. 1946లో కొండ ఎగువన ఉన్న మరియమాత స్వరూపం వద్ద సమష్టి దివ్యబలిపూజలు నిర్వహించేందుకు బలిపీఠాన్ని ఏర్పాటు చేశారు. శిఖరాగ్రానికి చేరుకునే కాలిబాటలను విశాల పరిచారు. 1951లో మేరీమాత స్వరూపం వద్ద ఆర్చి నిర్మించారు. ప్రస్తుతం సకల వసతులతో ఈ ఆలయం భక్తులకు చేరువైంది. సాధారణ రోజుల్లో వేలాదిగా భక్తులు వచ్చి మరియతల్లిని దర్శించుకుంటారు. ఏటా జరిగే ఉత్సవాలకు విశ్వాసులు లక్షలాదిగా ఇక్కడకు తరలివచ్చి తిరునాళ్లలో పాల్గొంటారు.
ఆలయం ముస్తాబు
తిరునాళ్ల నేపథ్యంలో మేరీమాత ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. యాత్రికుల సౌకర్యార్థం మెట్ల మార్గాలు, కాలి బాటలను సిద్ధం చేస్తున్నారు. ఆయా మార్గాలకు రెండు వైపులా రెయిలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడా తొక్కిసలాట జరగకుండా భక్తులకు వీలుగా పటిష్టంగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయం నుంచి శిఖరాగ్రం వరకు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు.
ఆధ్యాత్మిక వేదిక
మేరీమాత పుణ్యక్షేత్రం దిగువన ఉన్న బిషప్ గ్రాసీ పాఠశాల ఆవరణలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. మూడు రోజుల పాటు జరిగే సమష్టి దివ్యబలి పూజ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేదికపై జరుగుతాయి. ఈ కార్యక్ర మాలను తిలకించేందుకు వచ్చే యాత్రికుల కోసం వేదిక దిగువన చలువ పందిళ్లను సిద్ధం చేస్తున్నారు. యాత్రికులకు కనీస వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పలు ప్రదేశాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ప్రభుత్వ శాఖల సహకారం
ఉత్సవాలకు హాజరయ్యే యాత్రికుల కోసం ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ పాలకవర్గం అభ్యర్థన మేరకు ఆర్టీసీ అధికారులు కొన్ని ప్రత్యేక బస్సులు నడపనున్నారు. దూర ప్రాంతాల నుంచి గుణదల చేరుకునే ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు సైతం కొన్ని రైళ్లకు హాల్టింగ్ ఇచ్చారు. గుణదల, రామవరప్పాడు రైల్వే స్టేషన్లలో ఈ రైళ్లు ఆగు తాయి. పోలీసు శాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేప ట్టింది. మూడు రోజుల పాటు విధులు నిర్వహించేదుకు సిబ్బందిని నియమించారు.
గుణదల క్షేత్రానికి ఆధ్యాత్మిక శోభ


