తవ్వుకో... అమ్ముకో..! | - | Sakshi
Sakshi News home page

తవ్వుకో... అమ్ముకో..!

Feb 3 2026 9:47 AM | Updated on Feb 3 2026 9:47 AM

తవ్వు

తవ్వుకో... అమ్ముకో..!

తవ్వుకో... అమ్ముకో..! టీడీపీ నేతల అక్రమ మట్టి దందా

చంద్రయ్య డ్రైన్‌ను అడ్డగోలుగా తవ్వేసి మట్టిని అమ్ముకుంటున్న నాయకులు

చోద్యం చూస్తున్న డ్రైనేజీ అధికారులు

మండిపడుతున్న రైతులు,

పరిసర ప్రాంత ప్రజలు

గుడివాడ రూరల్‌: టీడీపీ నేతలు బరితెగించారు. 24 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తూ, 55 వేల ఎకరాల మురుగునీటిని దిగువకు మళ్లిస్తూ రైతులకు అండగా నిలిచిన చంద్రయ్య డ్రైన్‌ కరకట్టను అడ్డగోలుగా తవ్వేసి మట్టిని అమ్ముకుంటున్నారు. ఇంత అడ్డగోలుగా కరకట్టలనే తవ్వేస్తున్నా అటు డ్రైనేజీ అధికారులు కాని, ఇటు పాలకులు కాని పట్టించుకోకపోవడంపై పరిసర ప్రాంత రైతులు, ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... నందివాడ, గుడివాడ రూరల్‌, మండవల్లి మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగునీటిని అందించే చంద్రయ్య డ్రైన్‌ సాగునీరుతో పాటు మురుగునీటిని కూడా తీసుకుని వెళ్లి కొల్లేరులో కలుస్తుంది. దాదాపు 36 సంవత్సరాల క్రితం చంద్రయ్య డ్రైన్‌ పూడిక తీత పనులు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ డ్రైన్‌ పూడిక తీసిన పాపాన పోలేదు. ఇటీవల రూ.22 కోట్లతో చంద్రయ్య డ్రైన్‌ పూడిక తీత పనులకు టెండర్లు పిలిచామని, త్వరలోనే డ్రైన్‌ పూడిక తీత పనులు చేపడతామని కూటమి నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. మరోపక్క టీడీపీ నేతలే డ్రైన్‌ కరకట్టను అక్రమంగా తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారు. పోలుకొండ రెగ్యులేటర్‌ సమీపంలోని గాజులపాడు గ్రామాన్ని ఆనుకుని ఉన్న చంద్రయ్య డ్రైన్‌ కరకట్టను స్థానిక టీడీపీ నేత రుద్రపాక సబ్‌స్టేషన్‌ మెరక వంక చూపి గత మూడు రోజులుగా మూడు పొక్లెయిన్‌లతో కరకట్టను అడ్డగోలుగా తవ్వి ట్రాక్టర్ల ద్వారా మట్టిని సమీప గ్రామాల్లో అమ్ముకుంటున్నారు. ఒక్కో ట్రక్కు మట్టి రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి అనుమతులు ఉన్నాయంటూ అందరినీ నమ్మబలికి యథేచ్ఛగా అక్రమ మట్టి దందాను కొనసాగిస్తున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం...

చంద్రయ్య డ్రైన్‌ ఆనుకుని మూడు మండలాల్లో పదుల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికే రెగ్యులేటర్‌ వద్ద షట్టర్‌లు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. రెగ్యులేటర్‌ను పునః నిర్మిస్తారని అధికార కూటమి ప్రభుత్వానికి పట్టం గట్టిన స్థానిక ప్రజల నమ్మకాన్ని కూటమి నేతలు పక్కనబెట్టి ఏకంగా డ్రైన్‌నే కొల్లగొట్టే ప్రయత్నాలకు తెరలేపారు. భారీస్థాయిలో వరదలు వచ్చిన సమయంలో సైతం చంద్రయ్య డ్రైన్‌ రెగ్యులేటర్‌, కరకట్టలు పటిష్టంగా ఉండటంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కరకట్టలను పటిష్టం చేసిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం కూటమి నేతలు అడ్డగోలుగా మట్టి దందాకు తెరలేపి ఏకంగా కరకట్టనే తవ్వేసి సొమ్ము చేసుకుంటుండంతో భవిష్యత్తులో వరదలు వస్తే కరకట్టను ఆనుకుని ఉన్న గ్రామాలకు ముంపు ప్రమాదం సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా నందివాడ మండలం గాజులపాడు, తమిరిస, పోలుకొండ, అనమనపూడి, దండిగానపూడి, గొంగళ్లమూడి, మండవల్లి మండలం పెనుమాకలంక, నందిగామలంక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కన్నెత్తి చూడని అధికారులు...

వాస్తవానికి డ్రైన్‌ కరకట్టలను తవ్వే అధికారం ఎవరికీ లేదు. కరకట్టలను పటిష్టం చేయడానికి నిధులు తీసుకురావాల్సిన అధికార పార్టీ నేతలు నిబంధనలను తుంగలో తొక్కి ఏకంగా డ్రైన్‌ కరకట్టను తవ్వేసుకుంటున్నా అటు డ్రైనేజీ అధికారులు కాని, ఇటు రెవెన్యూ అధికారులు కాని కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. సాక్షాత్తూ డ్రైనేజీ ఈఈకి స్థానిక గ్రామాల ప్రజలు ఆధారాలతో సహా అక్రమ మట్టి తవ్వకాలపై సమాచారం ఇచ్చినా స్పందించిన దాఖలాలు లేవు. తమకు స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, తమను అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదని స్థానిక టీడీపీ నేత బరితెగించి మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారు. చివరకు స్థానిక ప్రజలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారంటే సదరు నేత బరితెగింపు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఇప్పటికై నా పాలకులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి దందాను అడ్డుకుని కరకట్టను పరిరక్షించాలని పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు వేడుకుంటున్నారు.

తవ్వుకో... అమ్ముకో..! 1
1/1

తవ్వుకో... అమ్ముకో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement