రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి
చిలకలపూడి(మచిలీపట్నం): మానవ తప్పిదాలతో జరిగే రహదారి ప్రమాదాలను నివారించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సోమవారం సాయంత్రం రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుతో కలిసి ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారులపై గుర్తించిన బ్లాక్ స్పాట్ల ను ప్రమాదాలకు అవకాశం లేకుండా తక్షణం స్పందించి పరిష్కరించాలన్నారు. జాతీయ రహదారులపై విద్యుత్ దీపాలు పనిచేయకపోవటం పట్ల కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారుల తీరు మారటం లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై కాలినడక వంతెనలకు రాజకీయ నాయకులు ఫ్లెక్సీలను కడుతున్నారని వీటి కారణంగా నేరాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ఆవాసాలుగా మారుతున్నాయన్నారు. వాటిని తొలగించేందుకు స్థానిక పోలీస్‌స్టేషన్లు ప్రత్యేక దృష్టిపెట్టాలని హెచ్చరించారు. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు మాట్లాడుతూ జాతీయ రహదారులపై విద్యుత్‌దీపాలు పనిచేయకపోతే సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తామని హెచ్చరించారు. గ్రామాల నుంచి జాతీయ రహదారులు కలిసే ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అటువంటి ప్రాంతాలను గుర్తించి అప్రోచ్ రహదారులపై స్పీడ్‌బ్రేకర్లు, ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. 2025 డిసెంబరు నెలలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 52 రోడ్డు ప్రమాదాలు సంభవించగా వాటిలో 32 మరణాలు, 31 మంది గాయాలపాలయ్యారని వివరించారు. సమావేశంలో జిల్లా రవాణాధికారి ఎన్‌యూఎన్‌ఎస్ శ్రీనివాస్, జాతీయ రహదారుల పీడీ విద్యాసాగర్, జిల్లా ప్రజా రవాణాధికారి వెంకటేశ్వర్లు, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేశ్వరరావు పాల్గొన్నారు.


