ముగిసిన వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు
కోడూరు: హంసలదీవి రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. సోమవారం ఉదయం కల్యాణమూర్తులకు వసంతోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆలయ సమీపంలోని చెరువులో వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ అవభృందోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ప్రత్యేక పల్లకిలో స్వామివార్లను ఊరేగించి ఆలయ ప్రాంగణంలో విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి, యాగశాలలో పూర్ణాహుతిని జరిపారు. రాత్రికి కల్యాణమూర్తులకు వివిధ రకాల పుష్పాలతో పుష్పాభిషేకం చేశారు. పవళింపుసేవతో ఉత్సవాలకు ముగింపు పలికారు. అనంతవరానికి చెందిన కుప్పా రామగోపాల సోమయాజి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆదివారం రాత్రి కల్యాణమూర్తులకు గ్రామోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. శృంగేరీ పీఠం పర్యవేక్షణలో మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించగా, రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని మూలమూర్తికి వెండి కవచాలను అలంకరించారు. ధర్మాధికారి కుప్పా సుబ్రహ్మణ్య అవధాని ఏర్పాట్లు పర్యవేక్షించారు.


