రంగు మారితే.. కొనేదే లే!
కొనుగోలు చేయాలని అధికారులకు మొరపెట్టుకుంటున్న రైతులు గురువిందగుంట పీపీసీ సెంటరులో రంగుమారిన ధాన్యం తెచ్చిన రైతులు మరో పక్క వాహనాలు లేక రోడ్డుపైనే బస్తాలు
చంద్రబాబు సర్కారు మాటలు నీటిమూటలే
పెడన: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతి గింజా కొంటామని చంద్రబాబు సర్కారు చెబుతున్న మాటలు..నీటి మూటలని పెడన మండలంలోని గురువిందగుంట రైతు సేవా కేంద్రం పరిధిలోని పలువురు రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. మోంథా తుపాను ప్రభావంతో 1318 రకం ధాన్యం మాడు తెగులు రావడంతో ధాన్యం తేలిక అవుతుందని, ఆరబెడితే మరింత తేలికగా మారి దిగుబడులు పూర్తిగా పడిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క వాతావరణం మార్పులతో తీవ్ర ఆందోళన పడుతున్నామని వాపోతున్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో బేరగాళ్లు బయలుదేరి తక్కువ ధరకు కొనుగోలు చేస్తామని, వాతావరణాన్ని చూపిస్తూ భయపెడుతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెడన మండలం గురువిందగుంట రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి గురువిందగుంట, కవిపురం, కొంగంచర్ల, కుమ్మరిగుంట రైతులు ధాన్యం విక్రయించుకునే అవకాశం ఉంది. అయితే చాలా మంది రైతులకు అవగాహన లేక ఇంకా బేరగాళ్లను నమ్ముతూ కొనుగోలు కేంద్రాలకు వెళ్లకుండా బేరగాళ్లకు తక్కువ ధరకు అయినా విక్రయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరో పక్క తేమ శాతం 17 మించి ఉంటే కొనుగోలు కేంద్రాల వారు కొనుగోలు చేయడం లేదు. ధాన్యం ఆరబెట్టి తీసుకురావాలని రైతులను తిప్పి పంపించేస్తున్నారు. దీంతో చేసేది లేక బేరగాళ్లకు అమ్మేస్తున్నామని చెబుతున్నారు. మరికొందరు రైతులు తాము కోత కోశామని, ధాన్యం బాగున్నా తీసుకు వెళ్లడానికి వాహనాలు లేక ఇదిగో అదిగో అంటూ రోజులు గడుపుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఒక లారీ ఒక మిల్లు నుంచి వస్తే తిరిగి అదే లారీ రావాల్సి వస్తోందని, దీంతో చాలా సమయం పడుతోందంటున్నారు. ట్రాక్టర్లు బయటివి పెట్టుకుంటే ముందుగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని, చేతుల్లో డబ్బులు లేని పరిస్థితుల వల్ల ముందు పెట్టుబడి పెట్టలేని దుస్థితిలో రైతులున్నారని పలువురు పేర్కొనడం గమనార్హం.
గురువిందగుంట ఆర్‌ఎస్‌కే పరిధిలో
రంగుమారిన ధాన్యం
గురువిందగుంట ఆర్‌ఎస్‌కే పరిధిలో రంగుమారినఽ ధాన్యాన్ని రైతులు తీసుకువచ్చి కొనుగోలు చేయాలని కోరుతున్నారు. అయితే రంగుమారిన ధాన్యం ఎవరూ తీసుకోవడం లేదని, మిల్లర్లు ముందుకు రావడం లేదని స్పష్టం చేస్తుండటంతో ఏం చేయాలో తెలియని దుస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. శాంపిల్స్ నాలుగైదు ఎకరాలకు చెందిన శాంపిల్స్ వచ్చాయని, ఇంకా 20 మంది రైతుల వరకు ఉండవచ్చునని చెబుతున్నారు.
రంగు మారితే.. కొనేదే లే!


