ఉండేవెన్నో...పోయేవెన్నో!
మొవ్వ మండలంలో 35 సింగిల్ టీచర్ పాఠశాలలు మూతపడేందుకు సిద్ధంగా ఉన్న పలు పాఠశాలలు సమాచారం ఇచ్చేందుకు నిరాకరించిన ఎంఈవో–2 శ్రీలక్ష్మి
మొవ్వ: విద్యార్థుల కొరతతో మొవ్వ మండలంలోని పలు పాఠశాలలు మూత పడే పరిస్థితి నెలకొంది. మొవ్వ మండల పరిధిలో గల 55 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో 35 పాఠశాలల్లో సింగిల్ టీచర్ ద్వారానే విద్యా బోధన సాగుతోంది. మండల పరిధిలోని నిడుమోలు (ఆర్) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కేవలం 12 మంది విద్యార్థులతో ఒక ఉపాధ్యాయురాలు బోధన చేస్తున్నారు. ఒకటో తరగతిలో ఒక్కరు, రెండో తరగతిలో ఒక్కరు, మూడో తరగతిలో ముగ్గురు, నాలుగో తరగతిలో ముగ్గురు, ఐదో తరగతిలో నలుగురు విద్యార్థులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఐదు తరగతుల విద్యార్థులకు కలిపి ఉపాధ్యాయురాలు మంజూష ఒకే తరగతిలో పాఠాలు బోధిస్తున్నారు. అలాగే అవురుపూడి (ఆర్) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో ఒక్కరు, రెండో తరగతిలో ఒక్కరు, మూడో తరగతిలో నలుగురు, నాలుగో తరగతిలో ఇద్దరు, ఐదో తరగతిలో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఐదు తరగతుల విద్యార్థులకు కలిపి ఒకే తరగతి గదిలో విద్యను బోధిస్తున్నారు. దీంతో వారికి విద్యాబోధన ఏ విధంగా సాగుతుందనే అనుమానాలు తల్లిదండ్రుల్లో అలుముకున్నాయి. ఒకటి, రెండు తరగతులు మాత్రమే ఉన్న మంత్రిపాలెం ప్రాథమిక పాఠశాలలో, అవురు పూడి(ఏఏ) పాఠశాలలో ఒకరిద్దరు విద్యార్థులతో పాఠశాలలు సాగుతున్నాయి.
ఫొటోలు తీసేందుకు వీల్లేదని
హుకుం జారీ చేసిన ఎంఈవో–2
నిడుమోలు పాఠశాలను విజిట్ చేసిన ‘సాక్షి’ ప్రతినిధిని ఫొటోలు తీసేందుకు వీల్లేదని ఉపాధ్యాయురాలు మంజూష నిరాకరించారు. దీనిపై ఎంఈవో–2 శ్రీలక్ష్మిని వివరణ కోరగా మీడియా ప్రతినిధులు ఫొటోలు తీసేందుకు వీల్లేదని దురుసుగా సమాధానం ఇవ్వటంతో పాటు ఇతర సమాచారం ఇవ్వటానికి సైతం ఆమె నిరాకరించారు.
ఉండేవెన్నో...పోయేవెన్నో!


