25 నుంచి సుబ్రహ్మణ్య షష్ఠి కల్యాణ మహోత్సవాలు
మోపిదేవి: కృష్ణాజిల్లా మోపిదేవిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు సుబ్రహ్మణ్య షష్ఠి కల్యాణ మహోత్సవాలు వైభవో పేతంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా వైదిక కార్యక్రమాలను అనుసరించి కొమ్మూరి ఫణికుమార్ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ ప్రధానార్చకుడు బుద్ధు పవన్‌కుమార్ శర్మ, ఆలయ వేద పండితుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు శుక్రవారం వెల్లడించారు. ఉత్సవ ప్రణాళిక(షెడ్యూల్)ను వివరిస్తూ ఈ నెల 25వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని పెండ్లి కుమారునిగా అలంకరిస్తారని, రాత్రి 7 గంటలకు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, రుత్విగ్వరణ, అంకురారోపణ, వాస్తుపూజ, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాద వినియోగం ఉంటుందని తెలిపారు. 26వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు ప్రాతఃకాలార్చనలు, గోపూజ, నిత్యహోమం, బలిహరణ, ఉదయం 11 గంటలకు శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం వైభవోపేతంగా నిర్వహిస్తామన్నారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పములు, తీర్థప్రసాద వినియోగం ఉంటుందని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు మయూర వాహనంపై రావి వారిపాలెం వరకు స్వామివారి గ్రామోత్సవం ఉంటుందన్నారు. 27వ తేదీ గురువారం ఉదయం 6 గంటలకు ప్రాతఃకాలార్చనలు, గోపూజ, నిత్య హోమం, బలిహరణ, పంచామృత స్నపన, వసంతోత్సవం, మహాపూర్ణాహుతి, తీర్థప్రసాద వినియోగం ఉదయం 11 గంటలకు రావివారిపాలెం గ్రామం వరకు శేషవాహనంపై శ్రీస్వామివారి గ్రామోత్సవం రాత్రి 7 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, రాత్రి 8 గంటలకు స్వామివారికి పుష్పశయ్యాలంకృత పర్యంక సేవ, తీర్థ ప్రసాద వినియోగం ఉంటాయని వివరించారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జరిగే ఈ షష్ఠి ఉత్సవాల కారణంగా ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్లు ఆలయ డీసీ శ్రీరామ వరప్రసాదరావు వివరించారు.


