‘సహకారం’తో ఉన్నత స్థితి
చిలకలపూడి(మచిలీపట్నం): సహకార వ్యవస్థ ద్వారా ఇస్తున్న సదుపాయాలను అందిపుచ్చుకుని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగవచ్చని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీరఘురాం అన్నారు. 72వ జాతీయ సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా బ్యాంకు ఆవరణలో సహకార జెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు. అనంతరం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో బ్యాంకు ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం చైర్మన్ మాట్లాడుతూ సహకార వ్యవస్థ ద్వారా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఎన్నో మార్పులు తీసుకువస్తున్నామన్నారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా పోటీతత్వంతో ముందుకు వెళుతున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఆత్మ నిర్భర భారత్ సాధకాలుగా సహకార సంఘాలు పటిష్టంగా సేవలు అందిస్తున్నాయన్నారు. పారదర్శకంగా కచ్చితత్వంతో వేగవంతంగా రైతాంగానికి, ఖాతాదారులకు బ్యాంకు ద్వారా ఇతోధికంగా సేవలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈవో ఎ. శ్యామ్‌మనోహర్, డీసీవో కె. చంద్రశేఖరరెడ్డి, సహకార విభాగాధికారి వీవీ ఫణికుమార్, బ్యాంక్ జనరల్ మేనేజర్లు బీఎల్ చంద్రశేఖర్, ఎన్. రఘుబాబు పాల్గొన్నారు.
కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం శ్రీరఘురాం


