దీక్షల విరమణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భవానీ దీక్షల విరమణలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న భవానీ దీక్షల విరమణపై మంగళవారం కలెక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా, ఆలయ ఈవో వీకే శీనానాయక్‌లతో కలిసి సమన్వయ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది దీక్షల విరమణకు సుమారు 6 లక్షల మంది భవానీలు తరలివస్తారని అంచనా అన్నారు. భవానీలు సంతృప్తి చెందేలా అమ్మవారి దర్శనభాగ్యం కల్పించాలన్నారు. అంతే కాకుండా ఇరుముడుల సమర్పణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీక్షల విరమణ చివరి రెండు రోజుల్లో దాదాపు 1.50 లక్షల మంది భవానీలు రానున్న దృష్ట్యా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాల తరహాలోనే దీక్షలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు 36 సెక్టార్లను ఏర్పాటు చేసి ఒక్కో సెక్టార్‌కు ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు.
కలశ జ్యోతులకు పటిష్ట ఏర్పాట్లు..
ముఖ్యంగా భక్తుల హోల్డింగ్ పాయింట్లు కేశఖండన ప్రదేశాలు, స్నాన ఘట్టాలు, గిరిప్రదర్శన, క్యూ లైన్లు, ఇరుముడుల సమర్పణ, హోమ గుండం, లడ్డూ విక్రయ కేంద్రాలకు సంబంధించిన సెక్టార్ అధికారులు అత్యంత అప్రమత్తంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని లడ్డూ విక్రయ కేంద్రాలు, ఉచిత భోజన సౌకర్య కేంద్రాల సంఖ్య పెంచాలన్నారు. ఈ ఏడాది 10 వేల మందికి పైగా భక్తులు కలశ జ్యోతులను సమర్పిస్తారని ఇందుకు అవసరమైన ఏర్పాటు చేయాలన్నారు. క్యూ మార్గంలో వాటర్ ప్రూప్ షామియానాలు, క్వాయిర్ మ్యాట్లు ఏర్పాటు చేయాలని మ్యాట్లను మూడో రోజు మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు అవసరమైన తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. హోల్డింగ్ పాయింట్ల వద్ద మరుగుదొడ్ల సంఖ్య పెంచాలని టోల్ గేట్ నుంచి ఓం టర్నింగ్ మధ్యలో మరుగుదొడ్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భవానీ భక్తుల దీక్షా వస్త్రాలను స్నాన ఘట్టాల వద్ద వదిలివేస్తారని... ఆయా ప్రాంతాలలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వస్త్రాలను స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏర్పాట్ల పరిశీలనకు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమన్వయ శాఖలకు సంబంధించి ఇద్దరు సిబ్బందికి విధులు కేటాయించాలన్నారు.
మూడు ప్రదేశాలలో హోమగుండాలు..
నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. పోలీసు అధికారులు, సిబ్బంది.. వివిధ శాఖల అధికారులు, సెక్టార్ అధికారులను సమన్వయం చేసుకొని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎక్కడ సమస్య ఎదురైనా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ ఈవో శీనానాయక్ మాట్లాడుతూ.. భవానీ భక్తులు ఇరుముడులు సమర్పించేందుకు మూడు ప్రదేశాలలో హోమగుండాలు ఏర్పాటు చేస్తామన్నారు. కలశ జ్యోతుల భక్తులు, భవానీ భక్తులకు చిన్న లడ్డూ, పులిహోర ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు డెప్యూటీ పోలీస్ కమిషనర్ జి.రామకృష్ణ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, వీఎంసీ అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ఆలయ ఈఈలు కె.కోటేశ్వరరావు, పి.రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.


