అంతర్ జిల్లా నేరస్తుడి అరెస్ట్
పమిడిముక్కల: రాత్రి సమయంలో ఇళ్లల్లో, దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నేరస్తుడి ఆటలకు పమిడిముక్కల పోలీసులు చెక్ పెట్టారు. నిందితుడి నుంచి రూ.2 లక్షల విలువైన 20 గ్రాముల బంగారం, లక్ష రూపాయలు విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు, రూ.10,250 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు పూర్వాపరాలను గుడివాడ సబ్ డివిజన్ ఇన్‌చార్జి డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నేరస్తుడు పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లి మండలం, మిలిటరీ మాధవరం గ్రామానికి చెందిన కడియాల శ్రీధర్‌గా గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ చిట్టిబాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీను సిబ్బందితో కలిసి మంగళవారం తాడంకి హైస్కూల్ వద్ద బైక్‌పై వెళ్తున్న ఓవ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. పమిడిముక్కల మండలం మంటాడ శివాలయంలో, కంకిపాడులో, తిరుపతిలో దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు. గతంలో అతనిపై జీఆర్పీ విజయవాడలో 13 కేసులు ఉన్నాయి. రైళ్లలో, రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌లలో దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవాడు. ఏడాది కాలంగా అంతర్ జిల్లాలలో బైక్ దొంగతనాలు, దేవాలయాలు, తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. బంగారం, ద్విచక్ర వాహనాలు, నగదు విలువ మొత్తం రూ.3,10,250 స్వాధీనం చేసుకొన్నారు. నేరం చేసే ప్రాంతాల్లో ముందుగానే రెక్కీ నిర్వహించి, చోరీలకు పాల్పడుతాడు. నేరస్తుడిని పట్టుకున్న అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ప్రత్యేకంగా అభినందించారు.
నేడు రైతుల ఖాతాల్లో
‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ జమ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులు బుధవారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారి డీఏంఎఫ్ విజయకుమారి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు, ఈ ఏడాది రెండో విడతగా రూ.7 వేలు జమకానున్నాయి. అందులో భాగంగా అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండో విడతగా ఒక్కో రైతుకు రూ.5 వేల చొప్పున జిల్లాలోని 1,18,629 మంది రైతుల ఖాతాల్లో రూ.59.31 కోట్లు, పీఎం కిసాన్ కింద ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు చొప్పున 1,02,015 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.20.40 కోట్లు జమకానున్నాయన్నారు. రెండు కలిపి మొత్తం 1,18,629 మంది రైతుల ఖాతాల్లో రూ.79.72 కోట్లు జమకానుందని పేర్కొన్నారు.
మినుము నూర్పిడి యంత్రంలో పడి
మహిళ దుర్మరణం
తోట్లవల్లూరు: పొట్ట కూటి కోసం కూలీ పనులకు వెళ్లిన మహిళ మినుము నూర్పిడి యంత్రంలో చిక్కుకుని మృత్యువాత పడిన ఘటన మండలంలోని వల్లూరుపాలెంలో జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన షేక్ ఖాశింబీ(40) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. రోజూలాగే పలువురి కూలీలతో కలిసి రొయ్యూరు శివారు తోడేళ్ల దిబ్బలంక సమీపంలో మినుము నూర్పిడి పనులకు ట్రాక్టర్‌పై వెళ్లింది. సాయంత్రం పని పూర్తయిన తరువాత నూర్పిడి యంత్రంలో చిక్కుకున్నవి తీసే క్రమంలో ప్రమాదవశాత్తు మిషన్‌లో పడి తీవ్ర గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లే క్రమంలో మృతి చెందినట్లు తెలిసింది. ఖాశింబీ మృతి చెందిన ప్రాంతం గుంటూరు జిల్లా కొల్లిపర పరిధిలోనిది కావటంతో అక్కడి పోలీసులకు స్థానిక పోలీసులు సమాచారం అందించినట్లు తెలిసింది. మృతురాలికి భర్త ఇస్మాయిల్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఖాశింబీ మృతి పట్ల గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
అంతర్ జిల్లా నేరస్తుడి అరెస్ట్


