కృష్ణా తీరాన కార్తిక జ్వాలా వైభవం
నాగాయలంక: స్థానిక కృష్ణాతీరంలో చతుర్థ వార్షిక కార్తిక మాసోత్సవాల్లో భాగంగా నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్ వద్ద శ్రీగంగ పార్వతీ సమేత శ్రీరామలింగేశ్వరునికి మంగళవారం రాత్రి 18 కిలోల అఖండ వత్తి దీప జ్యోతితో పలికిన నీరాజనం వైభవోపేతంగా జరిగింది. మూడున్నర అడుగుల ఎత్తు కలిగిన ఈ వత్తిని వెలిగించారు. అలానే లక్ష మారేడు దళాలతో భక్తులచే స్వీయ శ్రీరామలింగేశ్వరార్చన నిర్వహించారు. బాపట్ల జిల్లా బాపట్లలోని షిర్డి సాయిబాబా మందిరం పూజారి సాయి స్వామి ఇక్కడి శ్రీరామపాదక్షేత్రం సాగర సంగమ ప్రాంత విశిష్టత, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆకర్షితుడై రామలింగేశ్వరునికి ఈ ప్రత్యేకమైన భారీ వత్తి, నూనె మొత్తం తీసుకొచ్చి వరుసగా మూడో సారి సమర్పించారు. సాయిస్వామి 15మంది శిష్య బృందంతో తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆయనే స్వయంగా జరిపారు. నిత్య నవహారతులను వేద పండితులు బ్రహ్మశ్రీ సాయికిరణ్‌శర్మ, శిష్ట్లా సుబ్రహ్మణ్యం, అంగలకుదురు శివశర్మ నేతృత్వంలో భక్తిశ్రద్ధలతో ప్రదర్శించారు. వీటికి అభిముఖంగా మహిళలు కార్తిక ప్రమిదల ప్లేట్‌లతో సామూహిక హారతి ఇచ్చారు. ఉవ్వెత్తున లేచిన కార్తిక జ్వాలలతో స్వామికి అద్భత నివేదన జరపడంతో భక్తులు భక్తి పారవశ్యంతో అధ్యాత్మిక అనుభూతి చెందారు. వందలాది మంది మహిళలు, భక్తులు ఈవేడుకను తిలకించారు. క్షేత్రం కమిటీ చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు, సుజన కుమారి దంపతులు, ఉప్పల లీలాకృష్ణప్రసాద్, తలశిల రఘుశేఖర్, బోయపాటి రాము తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా తీరాన కార్తిక జ్వాలా వైభవం


