గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గృహ నిర్మాణాల పూర్తి అత్యంత ప్రాధాన్యత అంశంగా భావించి లబ్ధిదారులను ప్రోత్సహించి గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో గృహ నిర్మాణాల పురోగతిపై గృహ నిర్మాణ శాఖాధికారులు, ఎంపీడీవోలతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 31వ తేదీలోపు గృహనిర్మాణాలను పూర్తి చేస్తేనే లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు. ఆలోగా పూర్తి చేయకపోతే పథకం ముగిసిపోయి నష్టపోయే అవకాశం ఉందన్నారు. కాంట్రాక్టర్లు, లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం సచివాలయాల ద్వారా టాంటాం వేయించి లబ్ధిదారులను ప్రోత్సహించాలన్నారు. సొంత స్థలం లేక ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలం ఉండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు నిర్మించుకునే వారికి నవంబరు 5వ తేదీలో ముగిసి ఉండగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిందన్నారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల లబ్ధిదారులకు అదనపు సాయం అందిస్తున్న విషయాన్ని వివరించాలని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ ఇన్‌చార్జి పీడీ పోతురాజు, ఈఈ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ


