విజయవాడలో సంతాన ప్రాప్తిరస్తు చిత్రబృందం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరంలో సంతాన ప్రాప్తిరస్తు చిత్ర బృందం సందడి చేసింది. ఈనెల 14న విడుదలైన చిత్రం విజయోత్సవంలో భాగంగా గాంధీనగర్‌లోని జయరాం థియేటర్‌కు చిత్ర బృందం విచ్చేసింది. ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించింది. అనంతరం హీరో విక్రాంత్ మాట్లాడుతూ సంతాన ప్రాప్తిరస్తు చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి తన స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు పడే పాట్లు దర్శకుడు కామెడీ యాంగిల్‌లో తీసిన విధానానికి ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చిందన్నారు. తమ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులను కలుసుకొని వారికి కృతజ్ఞతలు చేపట్టేందుకు విజయయాత్ర చేపట్టినట్లు చెప్పారు. అనంతరం హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ సంతాన ప్రాప్తిరస్తు చిత్రం ఒక డీసెంట్ కామెడీ డ్రామా అని , అందుకే కుటుంబ సమేతంగా తమ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షిస్తున్నట్లు చెప్పారు. ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయన్నారు. ఈ చిత్రం కోసం తమ టీం కష్టపడి పని చేసిందని.. దానికి ప్రేక్షకుల నుంచి ప్రతిఫలం రావడం ఆనందంగా ఉందన్నారు.


