విషాద యాత్ర | - | Sakshi
Sakshi News home page

విషాద యాత్ర

Nov 14 2025 8:57 AM | Updated on Nov 14 2025 8:57 AM

విషాద

విషాద యాత్ర

తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి వస్తూ

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

తీవ్ర గాయాలై ఆస్పత్రిలో

చికిత్స పొందుతున్న చిన్న కూతురు

కారు అదుపు తప్పి చెట్టును

ఢీకొట్టడంతో ప్రమాదం

చెవుటూరు గ్రామంలో విషాద ఛాయలు

జి.కొండూరు: దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న ఆ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. దంపతులు మృతి చెందగా చిన్న కూతురు గాయాలపాలై ఆస్పత్రికి చేరింది. వివాహమై బొబ్బిలిలో నివాసం ఉంటున్న పెద్ద కూతురు రైలులో వెళ్లి తల్లి, తండ్రి, చెల్లితో కలిసి దర్శనం చేసుకొని తిరిగి రైలులో వస్తూ మార్గంమధ్యలో ప్రమాద విషయం తెలుసుకొని షాక్‌కు గురైంది. కొద్ది గంటల ముందు తనతో కలిసి ఉన్న తల్లిదండ్రులు మృతి చెందడం, చెల్లి ఆస్పత్రి పాలవడం ఆమెను కలిచివేసింది. ఎన్టీఆర్‌ జిల్లా, జి.కొండూరు మండల పరిధి చెవుటూరు గ్రామానికి చెందిన కుటుంబం కారులో తిరుపతి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో నెల్లూరు జిల్లా, గుడ్లూరు మండల పరిధి మోచర్ల, వీరేపల్లి గ్రామాల మధ్యన 16వ నంబరు జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది.

వివరాలలోకి వెళ్తే... చెవుటూరు గ్రామానికి చెందిన గుమ్మడపు మురళీకృష్ణ(64), మాధవీలత(56) దంపతులకు పెద్ద కూతురు నీలిమ, చిన్న కూతురు నిఖిత ఉన్నారు. కుమార్తెలు ఇద్దరికి వివాహం కాగా పెద్ద కూతురు విజయనగరం జిల్లా, బొబ్బిలిలో ఉంటుంది. అయితే మురళీకృష్ణ, మాధవీలతలు తమ చిన్న కూతురు నిఖితతో కలిసి సొంత కారులో మంగళవారం ఉదయం తిరుపతి వెళ్లారు. అదేవిధంగా పెద్ద కూతురు నీలిమ తన కుమారుడుతో కలిసి బొబ్బిలి నుంచి రైలులో తిరుపతి వెళ్లారు. వీరందరూ బుధవారం ఉదయం తిరుపతిలో కలుసుకొని దైవ దర్శనం పూర్తి చేసుకున్నారు. అక్కడి నుంచి గురువారం ఉదయం తిరుగు ప్రయాణంలో పెద్ద కూతురు, ఆమె కుమారుడుని రైలు ఎక్కించి, భార్యా భర్తలు మురళీ కృష్ణ, మాధవీలత, చిన్న కుమార్తె నిఖిత కారులో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా, గుడ్లూరు మండల పరిధి మోచర్ల, వీరేపల్లి గ్రామాల మధ్యన 16వ నంబరు జాతీయ రహదారిపై ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పడంతో రహదారి పక్కనే ఉన్న గానుగ చెట్టును ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో భార్య భర్తలు మురళీకృష్ణ, మాధవీలతలు అక్కడికక్కడే మృతి చెందగా కూతురు నిఖితకి తీవ్ర గాయాలయ్యాయి. గుడ్లూరు పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు కిమ్స్‌కు తరలించగా అదే ఆస్పత్రిలో క్షతగాత్రురాలు నిఖితకు చికిత్స అందిస్తున్నారు. ప్రమాద విషయం విజయవాడ చేరుకున్న తర్వాత తెలుసుకున్న పెద్ద కూతురు నీలిమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలిద్దరూ మృతి చెందడంతో చెవుటూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

విషాద యాత్ర 1
1/1

విషాద యాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement