సామాజిక స్థలాల అన్యాక్రాంతంపై విచారణ | - | Sakshi
Sakshi News home page

సామాజిక స్థలాల అన్యాక్రాంతంపై విచారణ

Nov 14 2025 8:57 AM | Updated on Nov 14 2025 8:57 AM

సామాజిక స్థలాల అన్యాక్రాంతంపై విచారణ

సామాజిక స్థలాల అన్యాక్రాంతంపై విచారణ

ఉయ్యూరు: సామాజిక స్థలాల అన్యాక్రాంతంపై జిల్లా పంచాయతీ అధికారి జె.అరుణ విచారణ చేపట్టారు. మండలంలోని గండిగుంట గ్రామంలో గురువారం ఆమె పర్యటించారు. కామన్‌ సైట్ల కబ్జా అంశంపై మీడియాలో ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించారు. సర్వే నంబర్ల ప్రకారం లే అవుట్లను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. డెప్యూటీ ఎంపీడీఓ కోటేశ్వరరావు, ఈఓ కుమార్‌లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లే అవుట్లకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లతో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

ఆస్తుల పరిరక్షణ బాధ్యత పంచాయతీలదే..

గ్రామాల్లో పంచాయతీల ఆస్తుల పరిరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శులదే అని డీపీఓ అరుణ అన్నారు. విచారణ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గండిగుంటలో సామాజిక స్థలాలు అన్యాక్రాంతం అయ్యాయని దినపత్రికల్లో వచ్చిన కథనాలు, సామాజిక కార్యకర్తల ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ చేపట్టామన్నారు. లే అవుట్లకు సంబంధించిన పూర్తి నివేదికలు తెప్పించుకుని జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు. లే అవుట్లకు సంబంధించి సామాజిక స్థలాలు అన్యాక్రాంతం అయినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఆక్రమణకు పాల్పడితే చర్యలు తప్పవు..

జీఓ నంబర్‌ 188 ప్రకారం.. పంచాయతీ ఆస్తుల పరిరక్షణ, సామాజిక స్థలాల రక్షణ బాధ్యత కార్యదర్శి, డెప్యూటీ ఎంపీడీఓలదేనని డీపీఓ అరుణ చెప్పారు. ఆస్తుల పరిరక్షణలో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లే అవుట్లలో సామాజిక స్థలాన్ని చూపి పంచాయతీకి తీర్మానం పొంది ఉంటే వాటిపై పంచాయతీలకు హక్కు ఉంటుందన్నారు. ప్రభుత్వ జీఓల ప్రకారం ఆ స్థలాలను పంచాయతీలు రిజిస్ట్రేషన్‌ చేసుకుని పరిరక్షించాలన్నారు. పంచాయతీలకు సంబంధించిన ఆస్తుల్లో బోర్డులు ఏర్పాటుచేయాలని, ఆక్రమణకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని తెలియజేయాలని ఆదేశించారు. కామన్‌ సైట్లను దొడ్డిదారిన డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అంశం నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అనుమతులు పొందిన లే అవుట్లలోనే స్థలాలు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. సామాజిక కార్యకర్తలు జంపాన శ్రీనివాసగౌడ్‌, కాండ్రు దయాకర్‌బాబు, బయ్యవరపు దుర్గాప్రసాద్‌, ఇటుకుల నాగరాజు, సాంబశివరావు, సాకే రావులమ్మ డీపీఓ అరుణను కలిసి సామాజిక స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆధారాలతో కూడిన పత్రాలను డీపీఓ అరుణకు అందజేశారు.

గండిగుంటలో పర్యటించిన డీపీఓ అరుణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement